
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి
బద్వేలు అర్బన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న హెడ్‌కానిస్టేబుల్ ఎం.లక్ష్మినారాయణ శనివారం మృతి చెందారు. 1990 బ్యాచ్‌కు చెందిన లక్ష్మినారాయణ (హెచ్‌సి 1180) బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ బదిలీల్లో భాగంగా బద్వేలు అర్బన్ స్టేషన్‌కు నియమితులయ్యారు. గత నెల 11వ తేదీన విధుల్లో చేరేందుకు తాను నివాసమున్న కమలాపురం నుండి ఖాజీపేట మీదుగా బద్వేలుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాజీపేట సమీపంలోని ఆంజనేయకొట్టాలు వద్ద చెట్టుకొమ్మ విరిగి లక్ష్మినారాయణపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కొద్దిరోజుల పాటు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఇటీవలే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ కూడా కోలుకోలేక శనివారం మృతి చెందారు.
మోపెడ్‌పై నుంచి పడి భర్త మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లి పంచాయతీ శ్రీరామ్ నగర్ వద్ద శనివారం సాయంత్రం టీవీఎస్ మోపెడ్‌పై వెళుతున్న భార్యాభర్తలు ప్రమాదవశాత్తు కింద పడడంతో భర్త సుబ్బరాయుడు (65) మృతి చెందాడు. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలో సుబ్బారాయుడు కుమారుడు నాగార్జునాచారి వెల్డింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, ఆయన భార్య వచ్చారు. శనివారం సాయంత్రం తిరిగి టీవీఎస్ మోపెడ్‌పై వారి గ్రామానికి వెళ్తుండగా టీవీఎస్ మోపెడ్‌కు సుబ్బరాయుడు భార్య చీర చుట్టుకోవడంతో ఒక్కసారిగా ఇద్దరు కింద పడ్డారు. అప్పటికే సుబ్బరాయుడు తలకు పెద్ద గాయం కావడంతో రక్తనాళాలు చిట్లాయి. 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తీసుకెళ్తుండగా మృత్యువాతపడ్డాడు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నంద్యాల పోలీసుల
అదుపులో టీడీపీ నాయకుడు
మైదుకూరు : మైదుకూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని శనివారం నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జీవీ సత్రంలో నివాసం ఉంటున్న ఈ టీడీపీ నాయకుడికి, నంద్యాలకు చెందిన ఓ పోలీసు అధికారి కుమారునికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి కాంట్రాక్టు పనులు చేయగా డబ్బు విషయమై గతంలో పంచాయితీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ విషయంలోనే టీడీపీ నాయకుడిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీ సత్రానికి సమీపంలోని టీ స్టాల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తొలుత కుటుంబ సభ్యులు కిడ్నాప్‌గా భావించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైదుకూరు ప్రాంతంలో కలకలం రేగింది.
పిచ్చి కుక్క దాడిలో
ముగ్గురికి గాయాలు
సిద్దవటం : ఎగువపేటలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ముగ్గురికి కాటు వేసింది. ఎగువపేట మఠంవీధిలో శనివారం సాయంత్రం తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కరిచింది. అలాగే పోలీసు లైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడిని, మెయిన్ బజారులో తేజా అనే యువకుడిని కూడా కరిచింది.
భార్యకు స్వల్ప గాయాలు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి