
భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
ఖాజీపేట : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది.. అయితే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని రెండవ భార్య అందరిని నమ్మించింది. భర్త మృతి విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారించారు. ఇది ఆత్మహత్య కాదు, రెండవ భార్య చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించి రెండో భార్యను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా..
ఖాజీపేట మండలం అప్పనపల్లె గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసులు యాదవ్ (50)కు 30 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన నక్కా లక్ష్మిదేవితో వివాహమైంది. భార్యతో గొడవల కారణంగా ఆమెకు తెలియకుండా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నక్కా సునీత (35)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని తప్పుడు ధ్రువ పత్రాలను చూపించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మిదేవి తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న శ్రీనివాసులు యాదవ్‌పై కేసు పెట్టింది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది.
మొదటి భార్య ఫిర్యాదుతో
వాస్తవాలు వెలుగులోకి..
శ్రీనివాసులు యాదవ్ జూన్ 11వ తేదీన మృతి చెందాడు. తన భర్త మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ మొదటి భార్య లక్ష్మిదేవి జులై 1వ తేదీన ఖాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. జులై 2న శ్రీనివాసులు యాదవ్ మృతదేహాన్ని రిమ్స్ డాక్టర్లు, తహసీల్దార్ సమక్షంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉందని ఈ గాయం కారణంగా చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అప్పనపల్లె గ్రామంలో లోతైన విచారణ జరిపారు.
భర్త అసభ్యకరమైన ప్రవర్తన
కారణంగానే హత్య..
మృతుడు శ్రీనివాసులు యాదవ్ మద్యం మత్తులో పిల్లల ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు. దీంతో రెండవ భార్య విసుగు చెందేది. జూన్ 11న ఇద్దరు పిల్లలు బయట ఉండగానే ఇంట్లోకి తాగి వచ్చి భార్య పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. భార్య తోసేయడంతో మంచం కోడికి తల తగిలి కింద పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసులు తిరిగి పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతను పైకి లేస్తే తనను చంపుతాడని భావించిన భార్య సునీత మంచం కోడికి తల పట్టుకుని కొట్టింది. దీంతో అక్కడికక్కడే స్పహ తప్పి పడిపోయాడు.
హత్యను ఆత్మహత్యగా..
తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య సునీత తీవ్ర ఆందోళన చెందింది. దీంతో ఇంట్లో పిల్లలను ఊయల ఉపే తాడుతో మృతదేహానికి ఉరి వేసింది. ఆ తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వారు వచ్చి చూసే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అందరిని నమ్మించింది. శరీరంపై ఎలాంటి రక్తగాయాలు గానీ దెబ్బలు గానీ పెద్దగా లేకపోవడంతో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించారు. జూన్ 12న అంత్యక్రియలు పూర్తి చేశారు.
నిందితురాలి అరెస్టు
మొదటి భార్య ఫిర్యాదు మేరకు జులై 2న పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి రెండో భార్య సునీత పరారీలో ఉంది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకుని అప్పనపల్లె పంచాయతీ సెక్రటరీ ద్వారా జులై 12న పోలీసుల ఎదుట లొంగిపోయింది. పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రెండవ భార్య సునీతను ఖాజీపేట సీఐ మోహన్ శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
మొదటి భార్య ఫిర్యాదుతో దర్యాప్తు
చేపట్టిన పోలీసులు
తలకు బలమైన గాయం కారణంగానే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో వెల్లడి
రెండో భార్య అరెస్టుతో ఆత్మహత్య
డ్రామా గుట్టురట్టు