
వక్ఫ్‌బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు : మండల పరిధిలోని టీచర్స్ కాలనీ వెనుక ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వక్ఫ్‌బోర్డుకు సంబంధించి మూడు ఎకరాల స్థలం ఉండగా అధికార పార్టీకి చెందిన కొంత మంది స్థలాన్ని లీజుకు తీసుకుని ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కొంత స్థలాన్ని లీజుకు తీసుకోగా మరికొంత స్థలాన్ని అనధికారికంగా వినియోగిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ స్థలంలో ఉన్న టైర్లతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు ఉవ్వెత్తున లేచాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలను తీసుకొచ్చి సాయంత్రం వరకు మంటలను అదుపు చేశారు. వక్ఫ్‌బోర్డు అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.