
పోలీస్ స్టేషన్ ముట్టడిపై కేసు నమోదుకు సన్నాహాలు
వేంపల్లె : వేంపల్లె పోలీస్ స్టేషన్‌ను ముట్టడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీరుపల్లెకు చెందిన సుమియా అనే బాలిక అదృశ్యం కావడంతో సోమవారం రాత్రి పక్కీరుపల్లె, బిడ్డాల మిట్ట, కాలేజీ రోడ్డులో ఉన్న పలువురు పోలీస్ స్టేషన్‌ను ముట్టడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్‌లోని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు రువ్వారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలిక సుమియా ఆచూకీ తెలిసిందని ఇక వెళ్లాలని నిరసనకారులకు పోలీసులు తెలిపిన వినకుండా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ సీసీ కెమెరాల్లో బంధించిన వీడియోలను చూసి నిరసనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. నిరసన సమయంలో రాత్రి రోడ్లపై తిరిగే మోటార్ బైకులను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మంగళవారం మోటార్ బైకుల కోసం వచ్చిన వారితో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, మోటార్ బైకు వద్ద ఫొటోలు తీసుకొని పంపించి వేశారు. సీసీ కెమెరాల్లో, పోలీసులు తీసిన వీడియోలో మోటార్‌బైకుదారులుంటే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో వందల మందిపై కేసు నమోదవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కేసు నమోదుపై పోలీసులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలనేది గుర్తించినట్లు తెలుస్తోంది.
బాలిక సుమియాకు కడప రిమ్స్‌లో చికిత్స..
సోమవారం రాత్రి పక్కీరుపల్లెకు చెందిన సుమియా ఆచూకీ తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు మంచినీరు తాపించి కడప రిమ్స్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్‌కు ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వెళ్లి చికిత్స పొందుతున్న బాలిక సుమియాను విచారించారు. మంగళవారం ఆ బాలిక కోలుకుని ఆరోగ్యంగా ఉందని సీఐ నరసింహులు తెలిపారు. వివరాలను బాలిక చెబితే తప్ప నిందితులను శిక్షించలేమని చెప్పారు. ఇప్పటికే చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడక బాబు, వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్ అనే అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ ముట్టడిపై కేసు నమోదుకు సన్నాహాలు