
సిగరెట్ తాగొద్దు అన్నందుకు యువకుడి ఆత్మహత్య
కురబలకోట : సిగరెట్ తాగొద్దు.. యుక్త వయస్సులో ఇదేమిపని అని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మండలంలోని అంగళ్లులో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ వెల్లడించిన వివరాల మేరకు..అంగళ్లు టమాటా మండీల సమీపంలో గుడిసెలు వేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో గోపాలమ్మకు కుమారుడు రెడ్డెప్ప (20) ఒక్కడే కుమారుడు. నాలుగు రోజుల క్రితం గుడిసెల వద్ద ఇతను సిగరెట్ తాగాడు. గమనించిన తల్లి గోపాలమ్మ మందలించింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
ఒకే మాట..ఒక్క జీవితం.!
ఉన్న ఒక్క కుమారుడు అకాల మరణం చెందడంతో పుత్ర శోకంతో తల్లి గోపాలమ్మ తల్లడిల్లిపోతోంది. రేయ్ రెడ్డెప్ప నన్ను క్షమించరా..సిగరెట్ తాగొద్దనడం నా తప్పయ్యింది.. నీ మేలుకోసమే చెప్పా. నువ్వు ఇంతపని చేస్తావనుకోలేదురా..సిగరెట్ తాగొద్దు అనే ఒక్క మాట నీ జీవితాన్నే తీసుకుపోతుందని ఊహించలేకపోయారా..అంటూ ఆ తల్లి బాధతో రోదించడం కలచివేసింది.