కమలాపురం : గత నెల 29న మా ఇంటికి కొందరు తాళాలు వేశారు.. వాటిని తెరిపించాలని కోగటం గ్రామానికి చెందిన రామిశెట్టి సతీష్ భార్య రాజేశ్వరి కోరారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన భర్త సతీష్ శనగల వ్యాపారం చేసి కొంతమందికి కోటి రూపాయల వరకు డబ్బు ఇవ్వాల్సి ఉందని, తమకు గ్రామంలో రూ.40 లక్షలు రావాల్సి ఉందన్నారు. నగదు అందగానే కడతామని చెప్పినా రైతులు వినకపోవడంతో ఒత్తిడి భరించలేక తన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడన్నారు. దీంతో రైతులు గత నెల 29న తమ ఇంటికి తాళం వేశారని, అప్పటి నుంచి తాను, తన పిల్లలు బంధువుల ఇంట్లో తలదాచుకున్నామని తెలిపారు. ఎస్పీకి ఫిర్యాదు చేసి.. కమలాపురం ఎస్‌ఐ వద్దకు వచ్చామని, ఇంటికి తాళం వేసిన వారి వివరాలతో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని ఎస్‌ఐ తెలిపారన్నారు. ఇదిలా ఉంటే ఆరేళ్ల క్రితం రైతుల వద్ద శనగలు కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకుండా తిప్పుతున్నాడని బాధితులు బషీర్, సుబ్బారెడ్డి, సాంబ శివారెడ్డి తదితరులు గతంలో కమలాపురం పోలీస్ స్టేషన్, తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగలేదని బాధిత రైతులు సతీష్ ఇంటికి తాళం వేసినట్లు తెలిసింది.