చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి

Jul 9 2025 6:55 AM | Updated on Jul 9 2025 6:55 AM

చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి

చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి

ముద్దనూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి జారిపడిన బాలిరెడ్డి(54) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ రమేష్‌ సమాచారం మేరకు ఈనెల 6వతేదీన బాలిరెడ్డి గ్రామంలో పీర్లపండుగ గుండం కాల్చడానికి మొద్దుల కోసం చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడడంతో అతనిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. వెంటనే ప్రొద్దుటూరుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలిరెడ్డి మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

గొర్రెలను ఎత్తుకెళ్లిన

దుండగులు

వేముల : వేములకు చెందిన చెల్లుబోయిన రమణయ్య గొర్రెలను సోమవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. రమణయ్య గొర్రెల పెంపకమే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం గొర్రెలను మేతకు తీసుకెళ్లిన అనంతరం మండల కార్యాలయం వెనుక వైపు ఉన్న దొడ్డిలో తోలుకున్నాడు. గొర్రెల దొడ్డి వద్ద రమణయ్య తల్లి కాపలా ఉంటూ నిద్రపోయింది. ఇదే అదనుగా అర్థరాత్రి సమయంలో దొంగలు దొడ్డిలోని 20 గొర్రెలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున చూసేసరికి గొర్రెలు లేకపోవడంతో బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ

కడప అర్బన్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి. యామిని ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌. బాబాఫకృద్దీన్‌ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ సేవాసదన్‌లో పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పారా లీగల్‌ వలంటీర్ల పాత్ర, డ్రెస్‌ కోడ్‌, ప్రవర్తన, నీతి ప్రమాణాలు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987, రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తదితర అంశాలను వివరించారు. అలాగే ప్యానల్‌ న్యాయవాదుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి జరిగిందని జడ్జి తెలిపారు. ప్యానల్‌ న్యాయవాదులు విధివిధానాలు, సివిల్‌ కేసులు, విధులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

36 జీఓ అమలు కోసం అర్ధనగ్న ప్రదర్శన

రాయచోటి టౌన్‌ : జీఓ నంబర్‌ 36ను అమలు చేయాలని కోరుతూ రాయచోటి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ఇంజినీరింగ్‌ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధ్యక్షుడు అక్బర్‌ మాట్లాడుతూ పని గంటలు పెంచి రూ.15 వేలు వేతనం ఇస్తున్నారని, పారిశుధ్య కార్మికులకు ఇచ్చినట్లుగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి అప్కాస్‌ కొనసాగించాలని లేదా పర్మినెంట్‌ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి శంకరయ్య, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామాంజులు, మున్సిపల్‌ యూనియన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బీవీ రమణ, నరసింహులు, ఇంజినీరింగ్‌ కార్మికులు దేవా, రమేష్‌, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement