
కళ్లు తెరిచిన కూటమి పెద్దలు
సాక్షి ప్రతినిధి, కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం వీడింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన విద్యార్థుల ఉద్యమానికి తోడు ..వైఎస్‌ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కు ప్రభుత్వంలో చలనం వచ్చింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయంపై సవతి తల్లి ప్రేమ కారణంగా 2025– 26 ఏడాదికి అడ్మిషన్లు నోచుకోలేదు. మరోవైపు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు దక్కలేదు. ఈ నేపధ్యంలో వారం రోజులుగా విద్యార్థులు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అదే విషయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ట్వీట్ చేస్తే ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచారు. బుధవారం అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కేంద్రమైన కడప నగరంలో 2020లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్‌యూ)కి సమాంతరంగా 14 రకాల స్పెషలైజ్డ్ కోర్సులతో విశ్వవిద్యాలయాన్ని కడప నగరంలో ఏర్పాటు చేసింది. యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో శాశ్వత భవనాల కోసం అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ 110 ఎకరాల భూమి సైతం కేటాయించింది. రూ.350 కోట్లతో విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల కోసం ఆకృతులు సైతం సిద్ధం చేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శాశ్వత భవనాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా పురోగతి లేదు. ఏఎఫ్‌యూ వ్యవహారాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. సీఓఏ (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్)అధికారులు అనుకూలంగా ఉన్నా ప్రభు త్వం పట్టించుకోలేదు. వెరసి గుర్తింపునకు నోచు కోలేదు. రెగ్యులర్ నియామకాలు లేకపోవడం మరో కారణంగా నిలిచింది. ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఏడీసెట్ నిర్వహణ చేపట్టి నూతన అడ్మిషన్లకు శ్రీకారం చుట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు నిరవధిక ఆందోళనకు దిగారు. మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి నేపధ్యంలో అన్యాయానికి గురయ్యామని వాపోయారు. ఈ అంశాలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఫలితంగా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మేల్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఏడీసెట్‌తో నిమిత్తం లేకుండా మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సీఓఏ అనుమతులు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూ
అడ్మిషన్లు చేపట్టేందుకు ఉత్తర్వులు
మెరిట్ ప్రాతిపదిక అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌కు స్పందన
సీఓఏ అనుమతులకు కృషి
చేయాల్సిందిగా విద్యార్థుల విన్నపం