
నిరసన గళం!
● ఎంపీ మిథున్‌రెడ్డిపై తప్పడు కేసు నమోదుపై ఆగ్రహం
● కూటమి వైఖరిని తప్పుపట్టిన నేతలు
● పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్‌కు సంబంధించి ఓటమి లేకుండా వరుస గెలుపులతో రికార్డు సృష్టిస్తున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై అధికార పార్టీ కన్నుపడింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ కీలక నేతలను మద్యం కేసు పేరుతో అరెస్టు చేసి పలువురిని జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాయలసీమలో రాజకీయంగా మంచి పట్టు ఉన్న పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరితంగా ప్లాన్ చేసి ఇరికించారు. అంతకు ముందు జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులోనూ ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబాన్ని ఇరికించేలా పన్నాగం పన్నారు. అయితే అప్పట్లో సీఎంఓ ఆదేశాలతో సీఐడీ విచారణ చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో మద్యం కేసులో అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విచారణ అనంతరం ఎంపీని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడంపై జిల్లాలో పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశారు.
కక్షసాధింపునకు పరాకాష్ట
కూటమి ప్రభుత్వం ఒక దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించింది. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట. రాష్ట్రంలో నియంతృత్వ రాక్షస పాలన కొనసాగుతోంది. ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించేది లేదు. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. – ఎస్‌బీఅంజాద్ బాషా ,
మాజీ డిప్యూటీ సీఎం
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూటమి సర్కార్‌పై రగిలిపోతున్నాయి. ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు కలకలం రేపింది. పార్టీ శ్రేణులు ఇతర నేతలంతా సీఐడీ విచారణకు హాజరైనా తిరిగి పంపిస్తారనుకునే లోపే అరెస్టు ప్రకటన అలజడి సృష్టించింది. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తుండటంతో ఆగ్రహం మీద ఉన్న పార్టీ శ్రేణులకు ఎంపీ అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు వెళ్లినా అందరినీ ఆప్యాయంగా పలుకరించి కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఎంపీని అరెస్టు చేయడంపై పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. మొత్తం మీద ఎంపీ అరెస్టుపై పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.
పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు

నిరసన గళం!