
మహాసభలను జయప్రదం చేయండి
విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి
రాజంపేట టౌన్: విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవరుచుకుంటే చదువులో రాణించగలరని ప్రేమ్‌చంద్ హిందీభవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక బీవీఎన్ పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ్‌చంద్‌కి జీవని అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా సర్తాజ్ హుస్సేన్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షల్లో పాల్గొనాలన్నారు. అప్పుడే తమలోని ప్రతిభ ఏమిటన్నది తెలుస్తుందన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: కడప నగర వేదికగా సెప్టెంబర్ 12,13,14 తేదీలలో నిర్వహించనున్న అఖిల భార త విద్యార్థి బ్లాక్ ( ఏఐఎస్‌బి) 9వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగరంలోని సెవంత్ కేఫ్ మిని హాల్లో జాతీయ మహాసభలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజంలో విద్యార్థి సంఘాల పాత్ర చాలా కీలకమైనదన్నారు. అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ మహాసభలు కడప నగర వేదికగా జరుగుతున్న శుభ సందర్భంగా విద్యావంతులు మేధావులు, విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు పి.వి.సుందర రామరాజు, ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్ధన్ మాట్లాడారు. ఏఐఎస్‌బీ నాయకులు పాపి రెడ్డి పల్లి పథ్వి,రాజేంద్రప్రసాద్ మనోజ్,చిరంజీవి, విష్ణు,కిరణ్ పాల్గొన్నారు.