
బంగారు తోరణం
● గండి ఉత్సవాలకు వేళాయె!
● మొదలైన ఉత్సవ సందడి
● ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు
చక్రాయపేట: శుభాల శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈమాసం అంటే ఆంజనేయుడికి ప్రీతికరం. అలాగే ఆయన భక్తులకు కూడా ఈ మాసమంటే ఎంతో ఇష్టం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఆంజనేయ స్వామి గుళ్లు పత్యేక అలంకరణకు నోచుకుంటాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో గండి వీరాంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అవును.. ఇక్కడి వీరాంజనేయ విగ్రహాన్ని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి తన స్వహస్తాలతో చెక్కడంతోపాటు ఆయనే ప్రతిష్టించారని ప్రతీతి. దీంతో భక్తులు ఇక్కడి స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.
సీతమ్మ తల్లి కోరిక తీర్చడం కోసం..
రావణున్ని సంహరించిన అనంతరం సీతా సమేతుడైన శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయాన గండి క్షేత్రానికి వచ్చే సరికి చీకటి పడిందట. ఈ సమయంలో సేద తీరుతున్న సీతమ్మ తల్లి అక్కడ కొండకు కనిపించిన పెద్ద రాయిని చూసి శుభగడియలు ముగిసేలోపు ఆంజనేయుడి విగ్రహాన్ని బాణపు ములికితో చెక్కాలని కోరిందట. దీంతో శ్రీరాముడు ఆమె కోరిక మేరకు ఆంజనేయుడి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించారు. శుభగడియలు ముగిసే సరికి ఆంజనేయుడి ఎడమచేయి చిటెకెన వేలు కొదవ పడింది. అంతటితో ఆపేసి విగ్రహాన్ని ప్రతిష్టింపజేశాడు.
● కాలక్రమంలో పూర్వీకులు భిన్నంగా ఉన్న విగ్రహం పూజలకు పనికి రాదని భావించి చిటికెన వేలిని చెక్కించేందుకు శిల్పిని రప్పించారు. స్వామి వారి చిటికెన వేలు చెక్కాలని సూచించారు. ఇందుకు ఉపక్రమించిన శిల్పి ఉలి దెబ్బ వేయగానే అక్కడ నుంచి రక్తం వచ్చిందట. దీంతో ఆ ప్రయత్నాన్ని పూర్వీకులు విరమించుకున్నారు. సీతాదేవి ఆంజనేయుడిని చిరంజీవిగా వర్ధిల్లు అని ఆశీర్వదించినట్లుగా గుర్తుకు రావడంతో స్వామి వారు ఇక్కడ సజీవంగా ఉన్నాడని భావించి అప్పటినుంచి పూజలు చేయడం ప్రారంభించారు.
గండి అంటే..
గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలు అంటారు. ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడేగాని తెగకుండా ఉన్నాయట. అలాంటి ఈ శేషాచల కొండలను పాపాఘ్ని నది మధ్యలో గండి పెట్టడంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందంట. ఇక్కడ వెలసిన స్వామిని గండి వీరాంజనేయస్వామి అని పిలుస్తారు.
పాపాఘ్ని నది
పాపాఘ్ని నది కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని నంది కొండల్లో పుట్టి గండి మీదుగా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో కలుస్తుంది. నంది పాద సముద్భూతా పాపాఘ్ని పుణ్యదాయినీ అని వాయు పురాణం చెప్పింది. అందువల్లే ఈనది పాపాలను హరించివేస్తుందని అందుకే దీన్ని పాపాఘ్ని నది అని పిలుస్తారు. పైగా దీన్ని ఉత్తర వాహిణిగా పిలవడం కూడా ఓ ప్రత్యేకతే.
గండిలో తపస్సు చేసుకుంటుండిన వాయుదేవుడు సీతారాముల వారు లంక నుంచి వస్తున్న విషయం తెలిసి రెండు కొండల మధ్యన బంగారు తోరణం నిర్మించి వారికి స్వాగతం పలికాడట. ఆ బంగారు తోరణం నేటికి కూడా ఉందని భక్తుల నమ్మకం. అది పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందట. ఇప్పటివరకు ఆ తోరణం కొందరికి మాత్రమే కనిపించిందట. వారిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్న సమయంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేస్తుండిన సర్ థామస్ మన్రో ఒకరని చెబుతారు.

బంగారు తోరణం

బంగారు తోరణం