
అంధకారంలో పట్టణాలు
కడప కార్పొరేషన్: కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైంది.. ఆరు దాటిందంటే చాలు చీకటి కమ్ముకుంటోంది. ఇంకేముంది ఓ వైపు ఈగలు,దోమల తాకిడి.. మరోవైపు విష పురుగుల అలికిడి.. ఇదీ వారం రోజులుగా ప్రజల దుస్థితి. కూటమి పాలన అధ్వాన తీరిది. ఒకటా రెండా 8 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేకుండా పోయింది. దీనికి తోడు కార్మికుల సమ్మెకు పారిశుధ్య కార్మికులు కూడా మద్దతివ్వడంతో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది.
● తమ డిమాండ్లు పరిష్కరించాలని మున్సిపల్ కార్మి కులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుమారు నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కార్మికులు ఈ నెల 12వ తేది అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. 8 రోజులుగా వారు తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి సేవలు బంద్ చేసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. 12 నుంచి ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లగా 16 నుంచి పారిశుధ్య కార్మికులు కూడా వారిని అనుసరించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. కడపలో 344 మంది ఇంజినీరింగ్ కార్మికులు, 664 మంది పారిశుధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 మంది సమ్మె చేస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మె ప్రభావంతో ఆయా పట్టణాల్లో ఆదివారం తీవ్ర తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కడప నగరంలో కొళాయిల్లో నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి ఉంది. గండి, లింగంపల్లి పంపింగ్ స్కీంల నుంచే కడప నగరానికి ప్రధానంగా తాగునీటి సరఫరా అవుతుంది. సచివాలయ ఉద్యోగుల ద్వారా తాత్కాలిక సిబ్బందిని నియమించుకొని తాగునీటిని సరఫరాకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది. వాల్వ్‌లు తిప్పి నీటిని విడుదల చేసిన తర్వాత మళ్లీ ఎవరూ వాటిని ఆఫ్ చేయకపోవడంతో చాలాచోట్ల తాగు నీరు వృథాగా పోతున్న పరిస్థితి ఉండగా, మరికొన్ని ప్రాంతాలకు నీరే సరఫరా కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా కడప నగరంలోని గంజికుంట కాలనీ, గౌస్ నగర్ వంటి ప్రాంతాల్లో చుక్క నీరు రాక ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది.
8 రోజులుగా వీధి దీపాల నిర్వహణ బంద్.. నీటి సరఫరా అంతంతే!
సాయంత్రమైతే చాలు అంధకారంలో కూరుకుపోతున్న సర్కిళ్లు
కార్మికుల సమ్మెనుపట్టించుకోని ప్రభుత్వం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల కడప కార్పొషన్‌తోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ పట్టణాల్లో అంధకారం నెలకొంది. ప్రతిరోజూ సాయంత్రం వీధి దీపాలు ఆన్ చేసి, ఉదయం 6 గంటలకు ఆఫ్ చేసే వారు లేకపోవడంతో ప్రధాన వీధుల్లో కూడా చిమ్మ చీకటి ఏర్పడింది. అక్కడక్కడ మాత్రమే లైట్లు ఆన్ చేస్తున్నారుగానీ, అధిక శాతం ప్రాంతాలు కటిక చీకటిలోనే మగ్గుతున్నాయి. అలాగే మరమ్మతులకు గురవుతున్న వీధి దీపాలను సరిచేసే వారు కూడా కరువయ్యారు. వీధి దీపాలు వెలుగుతున్న చోట 24 గంటలు వెలుగుతూనే ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వెలగని పరిస్థితి ఉంది. మరోవైపు పారిశుద్ద్య కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం వల్ల ఆయా పట్టణాల్లో పారిశుధ్యం కూడా అధ్వానంగా మారింది. సమ్మె ప్రభావం కనబడనీయకుండా ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్తను ఎత్తుతున్నారే తప్పా అనేక కాలనీల్లో వీధుల్లో చెత్త ఎత్తేవారు కరువయ్యారు.

అంధకారంలో పట్టణాలు

అంధకారంలో పట్టణాలు