
బద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్‌సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్‌సీ ఏఎన్‌ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్‌కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హుటాహుటిన పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. తన భార్య పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవ డం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది మాత్రం డాక్టర్ వచ్చేలోపే వారు వెళ్లిపోయారని చెబుతున్నారు.