
శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్/ కడప అర్బన్ : నిరంతరం శ్రమజీవుల పక్షాన, అంతరాలు లేని సమాజం కోసం పరితపించిన, కపటం లేని ప్రముఖ సామాజిక కార్యకర్త, సీహెచ్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పుత్తా శివారెడ్డి(65) ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటని పలువురు రాజకీయ, సామాజిక, అభ్యుదయ, స్వచ్ఛంద సంస్థల నేతలు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన శివారెడ్డి భౌతికకాయానికి నగరంలోని బాలాజీ నగర్‌లోని ఆయన నివాసంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు చంద్ర, చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం శక్తికి మించి శివారెడ్డి పని చేశారన్నారు. సమాచారం పొందడం ప్రజల హక్కు అని రహస్యాలు లేని పరిపాలన కోసం సమాచార హక్కు చట్ట రక్షణకు కృషి చేశారన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజాతంత్ర ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యేవారన్నారు. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టేందుకు ఎన్నికల నిఘా వేదికలో సభ్యులుగా తమ వంతు పాత్ర నిర్వహించేవారన్నారు. రిమ్స్‌లో శివారెడ్డి మరణించిన కొద్ది సమయంలోనే వారి కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు నేత్రదానం చేశారు. శివారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం రిమ్స్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దేహ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ, హేతువాద సంఘం నాయకులు సిఆర్వీ ప్రసాద్, నాగార్జున రెడ్డి, విరసం వరలక్ష్మి, శ్రీనివాసుల రెడ్డి, ప్రజానాట్యమండలి, నాస్తిక సంఘం నేత పల్లవోలు రమణ, లోక్ సత్తా శ్రీకృష్ణ, ఆప్ నేత డాక్టర్ శ్రీనివాసులు, రాయలసీమ ఎస్సీ ,ఎస్టీ మానవ హక్కుల వేదిక నాయకులు జేవీ రమణ, రిటైర్డ్ అధికారులు గోపాల్, ఫణిరాజు తదితరులు ఉన్నారు.

శివారెడ్డి ఆకస్మిక మరణం పౌర సమాజానికి తీరని లోటు