
ప్రభుత్వ స్థలంపై కన్నేశారు !
వల్లూరు (చెన్నూరు) : ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చ నేతలు వాలిపోతున్నారు. వేలు..లక్షలు కాదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారం అండ చూసుకుంటూ.. అధికారుల తీరును ఆసరాగా మార్చుకుంటూ కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న స్థలం చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామ పొలంలో శాటిలైట్ సిటీ సమీపంలో ఉంది. సర్వే నెంబర్ 405/2 –68 సెంట్లు, 406/1– 47 సెంట్లు,406/2– 2.07 రెండు ఎకరాల ఏడు సెంట్లు, 406/3 –11 సెంట్లు వెరసి మొత్తం 3.33 ఎకరాలను ఆక్రమించేందుకు భూబకాసురులు పథక రచన చేశారు. సర్వే నెంబర్ 405 లో 70 సెంట్ల స్థలం కబ్జా విషయమై గత జూన్ 15న ‘సాక్షి’పత్రికలో పతాక శీర్షికన కథనం రావడంతో వెనక్కి తగ్గిన కబ్జాకోరులు ప్రస్తుతం 1 బి అడంగల్ లో 3.33 ప్రభుత్వ భూమిగా కనబడుతున్న దానిని ఆక్రమించేందుకు మళ్లీ పనులు మొదలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నమాచుపల్లి గ్రామ పొలం ప్రాంతంలో భారీగా వెంచర్లు వెలిసి ఉండడంతో, అక్కడి భూములకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ విషయాన్ని కూటమి నేతలు తమకు అనుగుణంగా మార్చుకొని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూ మి ఆక్రమణదారుల పాలు కాకుండా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.
రూ. 10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం
చోద్యం చూస్తున్న
రెవెన్యూ అధికారులు