
ఒకే గదిలో ఐదు తరగతులు
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గది ఉండటంతో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు అదే గదిలో ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 25మంది విద్యార్థులు ఉన్నారు. ఏకై క ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు చదువులు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉంది. అలాగే పాఠశాల భవనాలు కూడా వర్షం వచ్చినప్పుడు వర్షపునీరు గదుల్లోకి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరో ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గండి టెండర్లు ..
కొన్నింటికే ఆమోదం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. టెండర్ల కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ, ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, మాజీ చైర్మన్లు కావలి వీరభాస్కరుడు, కల్లూరు వెంకట స్వామి, ఆలయ సూపరింటెండెంట్ సుభాష్, ఆర్కే వ్యాలీ పోలీసులు పాల్గొన్నారు.
8 తులాల బంగారం,
రూ.30 వేలు చోరీ
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామంలో రోడ్డు నంబర్ 10వ వీధిలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ఓ ఇంటిలో 8 తులాల బంగారు, రూ. 30 వేల నగదును చోరీ చేశారు. బాధితుడు మోదుగుల నరసింహులు వివరాల మేరకు.. మాధవరం–1 గ్రామంలో ఉన్న తన తండ్రి నరసింహులు(68) ఆదివారం ఉదయం మృతి చెందాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని తన భార్య లక్ష్మిప్రసన్న పొత్తప్పి గ్రామానికి తీసుకెళ్లిందన్నారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని తాను కువైట్ నుంచి సోమవారం పొత్తపికి వచ్చానన్నారు. అంత్యక్రియల అనంతరం బుధవారం మాధవరం–1 గ్రామానికి వచ్చామన్నారు. తమ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న బీరువాను తెరిచి దుస్తులను చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించామన్నారు. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, రూ. 30వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించుకొని వెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ, ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్‌టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.