
రుత్విక్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్
బి.కోడూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లె వద్ద గత ఆదివారం కంపెనీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా బైక్‌ను రుత్విక్ కంపెనీ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించగా మంగళవారం గుంత జయరామిరెడ్డి మృతి చెందాడు. కొండా జయరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతి చెందిన జయరామిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రజాప్రతినిధులతో కలిసి బి.మఠం మండలంలోని డి.అగ్రహారం వద్ద గల రుత్విక్ కంపెనీ క్యాంపు కార్యాలయం సమీపంలోని నేషనల్ హైవేపై ఽబుధవారం సాయంత్రం మృతదేహంతో ధర్నాకు దిగారు. అంతేకాకుండా రుత్విక్ కన్‌స్ట్రక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు సుమారు బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన పది మందికిపైగా మృత్యువాతపడ్డారని వారు ఆందోళన నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు ధర్నా నిర్వహించినప్పటికీ కంపెనీ వారు స్పందించలేదు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బద్వేలు అర్బన్ సీఐ, మైదుకూరు సీఐ, బి.మఠం ఎస్‌ఐలు రంగంలోకి దిగి మృతుని బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కంపెనీ యాజమాన్యంతో ఫోన్‌లో చర్చించారు. మృతుడు జయరామిరెడ్డి, తీవ్రంగా గాయపడిన జయరామిరెడ్డిలకు కలిపి కేవలం రూ.12 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలిపినప్పటికీ మృతుని బంధువులు ఒప్పుకోలేదు. మృతునికి భార్య రమాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని పోషించే నాథుడు కరువవడంతో కంపెనీ వారు ముందుకు వచ్చి వారిని ఆదుకుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కోరారు.

రుత్విక్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్