
అస్థిర పాలనలో తప్పటడుగు.!
కడప రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజే ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగుకు బదులుగా ‘అస్ధిర పాలనలో తొలి తప్పటడుగు’ అనేలా సాగిందనే ఆరోపణలు వినిపించాయి.
పరువు నిలబెట్టుకొనేందుకు తంటాలు...
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యుతకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం తదితర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నివాసాలను సందర్శించి పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అదే సందర్భంలో పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. పథకాలు అందలేదని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని గ్రహించి, ఆ తలనొప్పి ఎందుకని పార్టీ నేతలు చాలా నియోజక వర్గాల్లో తమకు అనుకూలమైన, ఎంపిక చేసిన నివాసాలను మాత్రమే సందర్శించారు. కొన్ని చోట్ల పింఛన్లు రాలేదు..తల్లికి వందనం డబ్బులు పడలేదు అంటే, ఇళ్లుందా, కారుందా అని అడిగి చూస్తాం..చేస్తాం అంటూ నేతలు చేతులు దులుపుకున్నారు.
ప్రొద్దుటూరులో 1వ వార్డులో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను చెప్పుకుంటూ వెళ్లారు. మైదుకూరులో రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు 31వ వార్డు రఘునాథపురంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ సమన్వయకర్త రితీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల నుంచి పథకాల అమలు తీరు గురించి తెలసుకోవడం కంటే పథకాల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. కడప నగరం 10వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఏకరువు పెట్టారు. జమ్మలమడుగులో పార్టీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి వెంకటేశ్వర కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన నివాసాలను సందర్శించినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణులకు అగ్ని పరీక్షగా మారింది. ఇటు ప్రజల్లో..అటు అధిష్టానం వద్ద పరువును నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నారని ఆ పార్టీలో చర్చసాగుతోంది.
ఎంపిక చేసిన నివాసాల సందర్శన
‘చూస్తాం..చేస్తాం’ ఇదీ నేతల తీరు
ప్రజల్లోకి వెళ్లాలంటే తమ్ముళ్ల ఇబ్బందులు
టీడీపీ ‘ఇంటింటికీ సుపరిపాలన’లో మొదటి రోజే నైరాశ్యం