
కల.. నిజమైన వేళ !
వారంతా శ్రమజీవుల బిడ్డలు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని.. కన్న వారి కలలను నిజం చేయాలని కలగన్నారు. కష్టపడి చదివారు.. వారి కష్టానికి ఫలితం దక్కింది. మహానేత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది. స్వప్నం సాకారమైన వేళ.. వారి కళ్ల నిండా సంతోషం కనిపించింది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.
వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
● రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 1010 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. 878 మంది విద్యార్థులు హాజరై ప్రవేశాలు పొందారు. త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు.
వైఎస్సార్‌ను స్మరించుకున్న విద్యార్థులు
రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్‌ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. భావిభారత ఇంజినీర్లుగా దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని అడ్మిషన్లు పాందిన విద్యార్థులు తెలిపారు.
ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ
మొత్తం 878 మంది
అడ్మిషన్లు పొందిన విద్యార్థులు