కవ్వింపు చర్యలు! | - | Sakshi
Sakshi News home page

కవ్వింపు చర్యలు!

Jul 1 2025 4:23 AM | Updated on Jul 1 2025 4:23 AM

కవ్వింపు చర్యలు!

కవ్వింపు చర్యలు!

సాక్షి ప్రతినిధి, కడప : అధికార బెత్తం పట్టుకొని ఓ సామాజిక వర్గాన్ని అక్కడ అణగదొక్కారు. వారందర్నీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తిస్తూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. ఇటీవల గ్రామ దేవత పెద్దమ్మ ఆలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని వారు పట్టు బట్టారు. చేస్తున్న తప్పును తప్పు అన్నందుకు వివక్ష మరింత అధికమైంది. ఆపై అధికార మదం తోడైంది. ఫలితంగా వెంటవెంటనే కవ్వింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. క్రమం తప్పకుండా వాదులాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి పోట్లదుర్తిలో పరస్పర రాళ్లదాడులు తెరపైకి వచ్చాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో కాస్తా ఉపశమనం దక్కినా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఎరగ్రుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో హైటెన్షన్‌ నెలకొంది. తాగుబోతుల మధ్య నెలకొన్న స్వల్ప వాదులాట చిలికి చిలికి గాలివాన లాగా మారి రెండు సామాజిక వర్గాల మధ్య పెద్ద వివాదంగా మారింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. వైన్‌ షాపులో మద్యం సేవిస్తున్న ఇరువురు ఆ తర్వాత ఖాళీ బాటిల్‌ను వెనుకకు వేశారు. ఆ వైపు ఉంటూ మద్యం సేవిస్తున్న మరో ముగ్గురు బాటిల్‌ మా వైపు ఎందుకు వేశారంటూ గొడవ పడ్డారు. చూడకుండా చేసిన పొరపాటును సీరియస్‌గా తీసుకోవద్దని అక్కడి వారు సర్ది చెప్పారు. అంతటితో వదిలేసి ఉంటే సరిపోయేది. ఊర్లో మీ కథ పెద్దదైంది. మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటూ పరుష పదజాలంతో దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మొదలయ్యాయి.

సురేష్‌నాయుడుపై తిరుగుబాటు..

వైన్‌ షాపులో చోటుచేసుకున్న వివాదం పోట్లదుర్తి గ్రామంలో సీఎం సురేష్‌నాయుడు ఇంటిపై తిరుగుబాటుగా మారింది. ఎంతకాలం మీ దౌర్జన్యాలను భరించాలంటూ మరో సామాజిక వర్గం ఆదివారం అర్థరాత్రి తర్వాత సురేష్‌నాయుడు ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. ఈ క్రమంలో పరస్పర రాళ్ల దాడులు తెరపైకి వచ్చాయి. సుమారు గంట పాటు సురేష్‌నాయుడు ఇంటి సమీపంలో రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎర్రగుంట్ల పోలీసులు సకాలంలో గ్రామానికి చేరుకొని ఉద్రిక్తతలను శాంతింపజేశారు. ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఉపశమనం కల్పించారు. కవ్వింపు చర్యల కారణంగా ఉత్పన్నమైన ఘర్షణ రెండు సామాజిక వర్గాలకు అంటుకుంది. దీనికి కారణం.. తమకు అడ్డు లేదు అనుకున్న సందర్భంలో పెద్దమ్మ దేవాలయం ప్రాంగణానికి మొత్తం ప్రహారీ నిర్మించాలని కొందరు పట్టుబట్టడమే. వెరసి ఇలాంటి వివాదాలు తరచూ తెరపైకి వస్తున్నాయని పలువురు వివరిస్తున్నారు. అధికారులు వారి విధులను పైరవీలకు తలొగ్గకుండా నిబద్ధతతో నిర్వర్తిస్తే ఇలాంటివి ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు. ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామాల్లో సమస్యలకు మూల కారకులుగా అధికారులు మారుతుండటం గమనార్హం. పోట్లదుర్తిలో పోలీసు పికెట్‌ కొనసాగుతున్నా వ్యవహారం నివురు గప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికై నా నిక్కచ్చిగా వ్యవహరించి కవ్వింపు చర్యలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పోట్లదుర్తిలో హైటెన్షన్‌

మద్యంషాపు వద్ద స్వల్ప వాదులాట

రెచ్చగొట్టి దాడికి పాల్పడిన

సురేష్‌నాయుడు వర్గీయులు

ఆపై పోట్లదుర్తిలో ఉద్రిక్తత..

పరస్పర రాళ్లదాడులు

సకాలంలో స్పందించిన పోలీసు బలగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement