
సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం
కడప సెవెన్‌రోడ్స్ : బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారిమఠంలోని మహా గురుకుల పాఠశాలకు తరలిస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఏఐఎస్‌బీ రాష్ట్ర కార్యదర్శి జయవర్దన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ సగిలేరు గురుకుల పాఠశాలను యధావిధిగా అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 1983లో ఏర్పడిన సగిలేరు గురుకుల పాఠశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి పాఠశాలను బి.మఠంలోని తోట్లపల్లె వద్ద ఉన్న మహా గురుకులంలో విలీనం చేయాలని భావించడం తగదన్నారు. ఇప్పటికై నా అధికారులు తమ నిర్ణయాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీపీఏ నాయకుడు భాస్కర్, ఏఐఎస్‌బీ రాయలసీమ కన్వీనర్ రాజేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
బాలింత మృతిపై విచారణ
బద్వేలు అర్బన్ : తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చి బాలింత మృతి చెందిన ఘటనపై సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.నాగరాజు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుండంరాజుపల్లె ఎస్టీ కాలనీలో సందర్శించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో కాన్పులు చేయడం చాలా ప్రమాదకరమని, ఎలాంటి శిక్షణలేని మంత్రసానులు ఇళ్లల్లో సొంతంగా కాన్పులు చేయకూడదని తెలిపారు. ప్రతి కాన్పు ఆసుపత్రిలోనే జరగాలని, గర్భిణులను ఆసుపత్రులకు తీసుకొని వెళ్లేందుకు 108 ఉపయోగించుకోవాలని సూచించారు. గర్భిణులకు, చిన్న పిల్లలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి మాత శిశు మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులు, సిబ్బంది పైన ఉందన్నారు. అనంతరం ప్రజాసంఘాల నాయకులు, మృతురాలి బంధువులను అడిగి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఏ. ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది ఖాజామొహిద్దీన్, డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభాన్ని ఆదివారం అర్ధరాత్రి ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మైదుకూరు రోడ్డు వైపున ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ స్తంభంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ధ్వంసమయ్యాయి. రేణిగుంట నుండి బద్వేలు మీదుగా గోపవరం సమీపంలోని సెంచూరి పరిశ్రమకు కలప లోడుతో వెళుతున్న లారీ నాలుగురోడ్ల కూడలిలోకి వచ్చేసరికి మలుపు తిప్పుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఢీ కొట్టింది. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

సగిలేరు పాఠశాలను తరలిస్తే ఆందోళన చేపడతాం