
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజలు సమర్పించే ఫిర్యాదులను పరిశీలించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఆమె అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపారు.
● తమ కుమారులు తమ వద్ద ఉన్న డబ్బు, బంగారం, స్థలాలు తీసుకుని తమను పోషించకుండా వదిలేశారని కడప విజయదుర్గ కాలనీకి చెందిన కుప్పం లక్ష్మినారాయణశ్రేష్టి ఫిర్యాదు చేశారు. వృద్ధులమైన తాను, తన భార్య జీవించడం కష్టంగా ఉందన్నారు. తామిచ్చిన స్థలాలు తమకు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
● వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇంటి వద్దకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ డీలర్లు ఇవ్వడం లేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్, కార్యదర్శి సుబ్బారావు ఫిర్యాదు చేశారు.
● ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రుణాలు మంజూరులో జాప్యం తగదని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ అన్నారు. దరఖాస్తులు స్వీకరించి బ్యాంకుల ద్వారా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారని, తర్వాత అర్హుల జాబితా విడుదల చేయలేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి
జిల్లాలో ప్రతి కుటుంబానికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. సంతృప్తికరమైన ఆర్థిక పరిపుష్టిపై మూడు నెలలపాటు జిల్లాలో క్యాంపెయిన్ నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, బ్యాంకింగ్ రంగం ప్రచురించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో జేసీ ఆవిష్కరించారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, బ్యాంకింగ్ యాక్సెస్ విస్తరించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా నైపుణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌తోపాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అదితిసింగ్