
మహిళా పోలీసు కౌన్సెలింగ్‌లో నిబంధనలకు పాతర
కడప సెవెన్‌రోడ్స్ : సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్‌లో ఉన్నతాధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు మహిళా పోలీసులు సోమవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియేట్ మహిళా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఉమాదేవి, కార్యదర్శి కె.సత్యకుమారి, దీప్తి మాధురిలు మాట్లాడుతూ ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 646 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా లేదన్నారు. నిబంధనలు పాటించకుండా కేవలం స్పౌజ్‌కే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జీఓ నెంబరు 6ను ఉల్లంఘించారని ఆరోపించారు. మెడికల్, పీహెచ్ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. కౌన్సెలింగ్ జాబితా కూడా ముందుగా నోటీసు బోర్డులో ప్రదర్శించలేదని చెప్పారు. ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న వారు, వేరే మండలాల నుంచి కూడా పనిచేస్తున్న వారు కడప యూఎల్‌బీలో పోస్టింగ్ తీసుకున్నారని వివరించారు. ఇందువల్ల మెరిట్ జాబితాలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కౌన్సెలింగ్ సమయంలో అన్ని సచివాలయాల పేర్లు చూపించలేదన్నారు. స్పౌజ్ కేటగిరీ కింద 14,215 ర్యాంకు వచ్చిన వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏ మేరకు న్యాయమంటూ ప్రశ్నించారు. కౌన్సెలింగ్ రద్దుచేసి నిబంధనల ప్రకారం పారదర్శకంగా రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జేసీకి మహిళా సంరక్షణ కార్యదర్శుల ఫిర్యాదు