
కూటమి పాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత ఉంటుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు స్పష్టం చేశారు. స్థానిక ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయ సముదాయ భవనంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించామన్నారు. ఉద్యోగులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపాలన్నారు. రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్స్‌కు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ఇస్తున్నారని, అదే తరహాలో చిత్తూరు, మంత్రాలయం రూట్లలోని కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ఇవ్వాలని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని కలిసి కోరడం జరిగిందన్నాని పూల నాగరాజు తెలిపారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగాగదులు, బాత్‌రూములను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు.ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మిక పరిషత్‌జోనల్ నాయకులు పురుషోత్తం పాల్గొన్నారు.