
నిందితుడి ఇంటిని కూల్చేస్తున్న గ్రామస్తులు
హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోని వైనం
నిందితుడి ఇంటిని కూల్చివేసిన గ్రామస్తులు
సాక్షి ప్రతినిధి, కడప/జమ్మలమడుగు: ఎవరైనా కష్టాలు, బాధల్లో ఉన్నప్పుడు.. నాలుగు ఓదార్పు మాటలు చెబితే వారికి ఎంతో మనో ధైర్యంగా ఉంటుంది. కానీ, ఈ కనీస మానవత్వం మరిచారు టీడీపీ కూటమి మంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో శుక్రవారం నాలుగేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ కామాంధుడు రహంతుల్లాను గ్రామస్థులే పట్టించారు. ఇక ఇంతటి తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న చిన్నారి కుటుంబాన్ని కడపలోనే ఉన్న మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాదరెడ్డి, సంధ్యారాణిల్లో ఒక్కరూ పరామర్శించలేదు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సహా వీరంతా మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జరిగిన ఘటనను వారు చాలా తేలిగ్గా తీసుకోవడంపై పరిశీలకులు ఆవేదన చెందుతున్నారు. ఇక కడప ఇన్‌చార్జి మంత్రి సవిత, హోం మంత్రి అనిత సానుభూతి ప్రకటనతో సరిపెట్టారు. అందుబాటులో ఉండి కూడా బాధిత కుటుంబాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ పరామర్శించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. కాగా, జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలోని నిందితుడు రహంతుల్లా ఇంటిని స్థానికులు శనివారం జేసీబీతో కూల్చివేశారు.
మరోవైపు హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇచ్చి అండగా నిలవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బాధితురాలి తల్లితో కలిసి జమ్మలమడుగు పాత బస్టాండ్ తాడిపత్రి రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పట్టుబట్టారు. అరగంటసేపు బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్డీవో సాయిశ్రీ వారితో మాట్లాడి శాంతింపజేశారు. కాగా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు తెలియడంతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శనివారం మధ్యాహ్నం బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా రూ.5 లక్షలు ప్రకటించారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు.