
భౌతిక శాస్త్ర పరీక్షకు 391 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన భౌతికశాస్త్ర పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 28 పరీక్షా కేంద్రాలకు గాను 3912 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 3521 మంది హాజరు కాగా, 391 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని నాలుగు బృందాల ఫ్లయింగ్ స్క్వాడ్ 12 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈఓ షేక్ షంషుద్దీన్ మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు.
27న జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ఉపాధి కార్యా లయం, జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు కడప నగరంలోని తమ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాఽధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీ కంపెనీలో ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2023, 24, 25 సంవత్సరాలలో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులన్నారు. అభ్యర్థులకు 16 ఏళ్లకు పైగా వయసు ఉండాలని, ఎంపికై న వారికి రూ.15000 నుంచి రూ.20,000 వరకు హోదాను బట్టి వేతనం ఉంటుదన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
వెలుగులోకి తామ్ర శాసనం
కడప కల్చరల్: కడప నగరంలోని స్థానిక ప్రముఖులు శారద ప్రసన్న ఆధీనంలోని తామ్ర శాసనాన్ని శుక్రవారం వెలుగులోకి తెచ్చారు. స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి దీని గురించి ఏపీగ్రఫీ విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డి దృష్టికి తీసుకు రాగా, ఆయన శాసనం వివరాలు వెల్లడించారు. 14వ శతాబ్దానికి చెందిన విజయనగరరాజు హరిహర రాయల కాలం నాటి శాసనమని గుర్తించారు. ఇందులో తెలుగుభాషకు సంబంధించిన అక్షరాలతో రాశారని, శక 1283, విజయ, భాద్రపద, శు 7 = 1361 ఆగస్టు 8, ఆదివారం నాటిదన్న వివరాలు ఇందులో కనిపిస్తున్నాయన్నారు. గుత్తి–రాజ్య చిరనది అనే ప్రదేశంలో గల యెదులపల్లి గ్రామానికి పాకనాటి తిమ్మయ అనే వ్యక్తిని గ్రామ నిర్వాహకుడిగా నియమించినట్లు ఉందన్నారు. దాంతోపాటు రాజు గ్రామంలోని అనేక భూములను బహుమతిగా ఇచ్చారని, ఈ వివరాలు కూడా ఇందులో నమోదు చేశారని, ఇంకా ఇచ్చిన భూముల సరిహద్దులను ప్రస్తావించారన్నారు.