
నిబంధనల మేరకే రేషన్ పంపిణీ
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వ నిబంధనలకు లోబడి రేషన్ సరుకులను వినియోగదారులకు సరఫరా చేయాలని, ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని జేసీ అదితిసింగ్ రేషన్ షాపు డీలర్లకు సూచించారు. జూన్ 1 నుంచి నిత్యావసర వస్తువులను ఎఫ్.పి. షాపుల (చౌక దుకాణాల)ద్వారానే పంపిణీ జరుగుతుందనే అంశంపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సభా భవన్ లో జిల్లాలోని డీలర్లలతో జేసీ అదితిసింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెల 1 వతేదీ నుండి 15 వతేదీ వరకు ప్రతి రోజు ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయాల్లో ఉదయం 8 నుంచి 12.00 గంటల వరకు సా. 4 నుంచి 8 గంటల వరకు ఎఫ్.పి. షాపులను తెరిచి ఉంచాలని రేషన్ డీలర్లకు ఆదేశించారు. ఎఫ్.పి. షాప్ నెం. పని వేళలు ధరలు, సరుకు నిల్వను సూచించే బోర్డును తప్పని సరిగా డిస్‌ప్లే చేయాలన్నారు. 65 ఏళ్లు పైన బడిన వారికి , దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేయాలన్నారు. ఎఫ్.పి. షాపుల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్డుదారులందరికి ఖచ్చితమైన తూకంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి రశీదును కూడా ఇవ్వాలని సూచించారు. ఇక మీదట నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేయడం జరుగుతుందన్న విషయాన్ని కార్డుదారులందరు గమనించాలని, డీలర్లు కూడా ఈ విషయాన్ని ప్రతి కార్డు హోల్డర్ కుటుంబానికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ చాముండేశ్వరి, డీఎం వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఓ రెడ్డి చంద్రిక, ఎఫ్‌పీ షాపుల డీలర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● జేసీ అదితి సింగ్
● జూన్ 1 నుంచి చౌక దుకాణాల ద్వారా పంపిణీ