
ప్రజల గుండెల్లో ‘పెద్దాయన’
ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ అందరినీ ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్.రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరుంది. పులివెందుల గ్రామాభివృద్ధికి సర్పంచ్‌గా ఆయన ఎనలేని సేవలందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది.
పులివెందుల : తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ, కరవు లాంటి విపత్కర పరిస్థితులలోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాలలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. రాజకీయాల్లోకి రాకమునుపు నుంచి పులివెందుల్లో వైఎస్.రాజారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన వద్దకు వెళితే పరిష్కారం అవుతుందని ప్రజల నమ్మకం. ఆయన అభిమానులు ఈ నాటికి రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచుగా తొలుత ప్రజా ప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు సర్పంచ్‌గా ఆయన పనిచేశారు. పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి చెరువులను తవ్వించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహామనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రైతులను ఆదుకున్న దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడా పెద్దాయన వైఎస్.రాజారెడ్డి పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.
పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం
దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంతంలో ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్.రాజారెడ్డి బ్రతికున్న కాలంలో ఆ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ప్రజలు మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్.రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడూ తెరిచి ఉండేవి. అంతేగాక దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్.రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. తనయుడు వైఎస్‌ఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.
విద్యా ప్రదాతగా:
దివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ను నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్ చూపిన బాటలోనే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.
నివాళులర్పించనున్న
వైఎస్ కుటుంబ సభ్యులు
నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్.జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్.జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్.విజయమ్మ, ఇతర కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు.
వైఎస్‌ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు
పులివెందుల సర్పంచ్‌గా
గ్రామాభివృద్ధికి కృషి
నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి
నివాళులర్పించనున్న
వైఎస్ కుటుంబీకులు