
ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి
ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి
పోరుమామిళ్ల : కూటమి పాలనలో ప్రజలకు కష్టా లు, కన్నీళ్లే మిగిలాయని ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి అన్నారు. విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పనిచేసిన కాలంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రశంసలందుకుందన్నారు. కూటమి పాలనలో మంత్రుల సబ్ కమిటీ నిర్ణయంతో రేషన్ బండ్లు నిలిచి పోయాయన్నారు. ఎండీయూ వాహనాలకు మంగళం పాడుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల మేర నడచి వెళ్లి, రేషన్ షాపుల వద్ద క్యూలో నిల్చుని స రకులు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఎండీయూ వాహనాలతో గతంలో నిరుద్యోగులకు ఉపాధి కలిగిందని, ఆ విధానం రద్దుతో వారంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామన్న చంద్రబాబు గతంలో వలంటీర్ల వ్యవస్థ, తాజాగా ఎండీయూ వ్యవస్థ రద్దు చేసి నిరుద్యోగుల పొట్ట కొట్టిందన్నారు.
పోలీస్ బైక్‌తో ఉడాయింపు
ప్రొద్దుటూరు క్రైం: ఏదైనా వాహనం కనిపించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. స్టేషన్‌లోని పోలీస్ వాహనం చోరీ అయితే ఎవరికి చెప్పుకోవాలి. గురువారం అదే జరిగింది. బ్లూకోల్ట్స్ పోలీసుల వాహనంతోపాటు రూ.14 వేల నగదు అపహరించి ఉడాయించాడు ఓ నిందితుడు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలో ఇటీవల చోరీలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రొద్దుటూరు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ఏ కారణం లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్దరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా రూరల్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా అతను కర్ణాటక వాసిగా గుర్తించారు. వేలి ముద్రలను తీసుకున్న తర్వాత ఎస్‌ఐ–2 గదిలో ఉంచారు. బుధవారం వేకువ జామున స్టేషన్‌లో ఉన్న అతను ఎస్‌ఐ గదిలోని రూ.14వేల నగదుతో పాటు బయట పెట్రోల్ బంకు వద్ద ఉన్న బ్లూకోల్ట్స్ బైక్ తీసుకొని పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ పోలీసులను వివరణ కోరగా.. ఙఅనుమానంతో స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు. డబ్బు తీసుకెళ్లలేదని, బైక్ తీసుకెళ్లినట్లు తెలిపారు.
చోరీ కేసులో జైలు శిక్ష
ఓబులవారిపల్లె: కొర్లకుంట క్రాస్ రోడ్డులో లవనూరు దామోదర్ ఉంచిన మోటారు సైకిల్‌ను సత్యసాయి జిల్లా కామసముద్రం గ్రామానికి చెందిన పటాన్ సాహెబ్ చోరీ చేశారు. మంగంపేట అగ్రహారానికి చెందిన బాలాజీ ఆటోను ధర్మవరం వద్ద శివశంకరాచారి తీసుకెళ్లాడు. ముద్దాయిలను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో మెజిస్ట్రేట్ తేజసాయి జైలు శిక్ష విధించారు.