
ఏడాది పాలనలో.. ఒరిగిందేమీ లేదు
ప్రొద్దుటూరు : ఎన్డీఏ కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. తన స్వగృహంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారన్నారు. వలంటీర్ల వేతనాలను రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేశారన్నారు. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో సాంకేతిక కారణాలతో వేలిముద్రలు పడక.. రేషన్ దుకాణాల చుట్టూ కార్డుదారులు తిరగాల్సి వస్తుందన్నారు. చెత్త సేకరణ వాహనాలను తొలగించడంతో పట్టణాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయిందన్నారు. సీబీఎస్‌ఈ విధానాన్ని స్కూళ్లల్లో రద్దు చేశారని, విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెట్టారన్నారు. జగన్ ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలు మంజూరు చేయిస్తే.. కూటమి ప్రభుత్వం ప్రారంభించకుండా వాయిదా వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుమల, సింహాచలంలో భక్తులు మరణించారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఆయననే ప్రశంసిస్తూ మహానాడు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వరదల ప్రభావానికి అమరావతిలో ఇళ్లల్లోకి వచ్చిన నీరు తోడుకుంటుంటే ప్రభుత్వం మాత్రం అద్భుతంగా నిర్మించినట్లు ప్రచారం చేస్తోందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఏదైనా నామినేటెడ్ పోస్టు కోసం ఆయనకు బాకా ఊదుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తలు రాస్తున్నాయేమోననే ఆనుమానం కలుగుతోందన్నారు. ప్రొద్దుటూరులో రూ.20 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మించలేని ప్రభుత్వం, వంద కోట్లకు సంబంధించిన తీర్మానాలను మినీ మహానాడులో ప్రవేశపెడతామనడం విచిత్రంగా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గుర్రం లావణ్య, గరిశపాటి లక్ష్మీదేవి, రాగుల శాంతి, సత్యం, వంశీధర్‌రెడ్డి, బీఎన్‌ఆర్ పాల్గొన్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు
వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేశారు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి