
నాడు మట్కా బీటర్లు.. నేడు గంజాయి విక్రేతలు
– నలుగురు అరెస్ట్, 1500 గ్రాముల గంజాయి స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం : వీరు పేరు మోసిన మట్కా బీటర్లు. ఏళ్ల తరబడి మట్కా నిర్వహిస్తూ ఎందరి జీవితాలో నాశనం కావడానికి కారకులయ్యారు. ఇటీవల పోలీసులు క్రికెట్ బెట్టింగ్, మట్కా దాడులు ముమ్మరం చేయడంతో వీళ్లు మట్కా రాయడం మానుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గంజాయి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తుంటారు. ఈ విషయం పోలీసుల చెవిన పడటంతో.. వీరి అక్రమ వ్యాపారానికి బ్రేకులు పడ్డాయి. పెన్నానదిలోని ఆర్టీపీపీ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన షేక్ హుస్సేన్‌బాషా అలియాస్ గూగూడు, సయ్యద్ ఖాదర్ అలియాస్ కదీర్‌తోపాటు పవర్‌హౌస్ రోడ్డుకు చెందిన టప్పా నసీర్ రసూల్, షేక్ జమాల్‌బాషాను వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1500 గ్రాముల గంజాయి, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హుస్సేన్‌బాషా అలియాస్ గూగూడుపై గతంలో మట్కా, లిక్కర్, గంజాయి తదితర సుమారు 46 కేసులు ఉన్నాయి. అలాగే సయ్యద్ ఖాదర్ అలియాస్ కదీర్‌పై కూడా వివిధ పోలీస్‌స్టేషన్లలో గంజాయి, మట్కా, లిక్కర్ తదితర సుమారు 48 కేసులు ఉన్నాయి. నసీర్ రసూల్, జమాల్‌బాషాలపై రెండేసి చొప్పున కేసులు ఉన్నాయి. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండు నిమిత్తం కోర్టులో హాజరు పరచనున్నట్లు వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.
స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
కడప కల్చరల్ : కడపకు చెందిన రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి గాను ప్రతిభ గల పేద రెడ్డి విద్యార్థులు స్కాలర్‌షిప్ మంజూరు కోసం కార్యవర్గంలో నిర్ణయించుకోవాలని సంస్థ సభ్యులు తెలిపారు. అర్హత గల విద్యార్థిని, విద్యార్థులు రెడ్డి సేవా సమితి కార్యాలయం నుంచి దరఖాస్తులు పొంది.. మే 31వ తేదీలోగా దరఖాస్తు పూర్తి చేసి రెడ్డి సేవా సమితి కార్యాలయంలో సమర్పించాలని సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కుప్పిరెడ్డి నాగిరెడ్డి, లెక్కల కొండారెడ్డి, గుడ్ల నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హులకు స్కాలర్‌షిప్ మంజూరు చేయనున్నట్లు వారు వివరించారు. వైద్య విద్య అభ్యసించే విద్యార్థి నీట్ ర్యాంకు పొంది ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలని, వారికి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ రూపంలో రూ.25 వేలు ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. సాంకేతిక విద్య (బీటెక్) అభ్యసించే అభ్యర్థులు ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు పొంది ఉండాలని, అలాంటి వారి స్కాలర్‌షిప్ కింద రూ. 25 వేలు ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు రూ.10 వేలు, ఇతరులకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థికి ప్రతి ఏడాది స్కాలర్‌షిప్ కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ బీఎస్సీ విద్యను అభ్యసించే వారికి ఎంసెట్‌లో ర్యాంకు పొంది ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలని, అలాంటి వారికి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ కింద రూ.20 వేలు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. దాఖలు చేసిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పూర్తిగా పరిశీలించి, విచారణ చేసి ఆర్థిక స్థోమత గురించి చర్చించి రెడ్డి సేవా సమితి వారికి స్కాలర్‌షిప్ కోసం సిఫార్సు చేయనున్నట్లు వివరించారు. స్కాలర్‌షిప్ విషయంలో రెడ్డి సేవా సమితి వారిదే తుది నిర్ణయమని తెలిపారు.