టీడీపీ గూండాల దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాల దాష్టీకం

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:33 AM

పులివెందుల : పులివెందులలో టీడీపీ గూండాల అరాచకాలు హెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్న టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం ఉదయం భాకరాపురంలోని తన ఇంటిలో టిఫిన్‌ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మైనింగ్‌ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డిని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. దాదాపు 30మంది యువకులు బైకులపై ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి దాడి చేసినట్లు తెలుస్తోంది. బీటెక్‌ రవిపై పోస్టులు పెట్టే మగాడివా అంటూ దూషించారని, తనకు అసలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడమే తెలియదని చెబుతున్నా దాడి చేశారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. దాడి దృశ్యాలు ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోసం వెళ్లినందుకే..

బుధవారం టీడీపీకి చెందిన ఓ నాయకుడు వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డిని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. దీన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిన్న అనే యువకుడు సోషల్‌ మీడియాలోనే టీడీపీ నాయకుడు పెట్టిన పోస్టును ట్యాగ్‌ చేస్తూ కౌంటర్‌ పోస్టు పెట్టాడు. దీంతో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు చిన్నాను పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకుని అర్బన్‌ పోలీస్‌ ష్టేషన్‌లో ఉంచి అతనిపై నాటు సారా కేసు కట్టేందుకు ప్రయత్నించసాగారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లి అక్కడ ఎస్‌ఐ, డీఎస్పీలతో చర్చించారు. చిన్నాపై అక్రమ కేసు బనాయించడం అన్యాయమని ప్రతాప్‌రెడ్డి డీఎస్పీ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ నాయకులు గురువారం తనపై దాడి చేశారని ప్రతాప్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎలాగైతేనేమి వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిన్నాపై గురువారం నాటు సారా కేసు పోలీసులు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించి ప్రతాప్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

ఎస్పీకి ఫోన్‌ చేసిన ఎంపీ

ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. జిల్లాలో సర్పంచ్‌, ఎంపీపీల ఎన్నికల సందర్భంగా గోపవరంతోపాటు ఇతర ప్రాంతాలలో టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రతాప్‌రెడ్డిపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి

ఇంటి వద్దకు వెళ్లి లాక్కొచ్చి దౌర్జన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement