
వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులతో రైల్వే సీఐలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రైల్వేస్టేషన్ వద్ద తండ్రితోపాటు ఇద్దరు బిడ్డలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.ఈ ఘటన గురువారం జరిగింది. ట్రాక్‌పై పడుకున్న వీరిని రైల్వే కానిస్టేబుల్ గమనించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడప నగరం మృత్యుంజయకుంటకు చెందిన పాలెంపల్లె వెంకటసుబ్బయ్య ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి భార్య ఉదయగిరి నాగలక్ష్మితోపాటు కుమార్తె సుదీక్ష (4), భువనేశ్వర్ (ఒకటిన్నర సంవత్సరం) ఉన్నారు.
అయితే కుటుంబంలో చోటుచేసుకున్న కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వెంకట సుబ్బయ్య తన ఇద్దరు బిడ్డలను తీసుకుని కడప రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. గూడ్స్ వద్ద రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీఎఫ్ పోలీసులు వారిని గమనించి హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
తండ్రీబిడ్డలను రైల్వే పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం నాగలక్ష్మిని పిలిపించి వారి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే సీఐలు శ్రీనివాసులు, నాగార్జునలు మాట్లాడుతూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. మూడు ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసులను గుంతకల్లు రైల్వే ఎస్పీ చౌడేశ్వరి, డీఎస్పీ షేక్ షాను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్‌ఐ రారాజు, సిబ్బంది పాల్గొన్నారు.