స్మార్ట్‌.. సాధికారత! | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌.. సాధికారత!

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

సోషల్‌ మీడియా సాయంతో..

సాక్షి, యాదాద్రి : జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్‌ వినియోగం శరవేగంగా పుంజుకుంటోంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే తాజా గణాంకాల ప్రకారం.. జిల్లా మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా సమాచారం, వినోదంతోపాటు ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకుంటూ డిజిటల్‌ రంగంలో సత్తా చాటుతున్నారు.

సెల్‌ వినియోగం పెరుగుతోంది..

జిల్లాలో 15 నుంచి 49 ఏళ్ల వయస్సున్న మహిళల్లో 71.3 శాతం మంది సొంతంగా సెల్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. అలాగే 74.1 శాతం మంది ఇంటర్నెట్‌ సేవలు వినియోగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ పేమెంట్లు, సమాచార సేకరణకు నెట్‌ వినియోగం పెరిగింది. విద్యావసరాలకు యువతులు, ప్రాథమిక ఆరోగ్య సమాచారం కోసం గర్భిణులు, బాలింతలు ఫోన్లను సద్వినియోగం చేసుకుంటున్నారు.

బ్యాంక్‌ ఖాతాలు 92.8 శాతం మందికి..

జిల్లాలో 92.8 శాతం మంది మహిళలకు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో సొంత సేవింగ్స్‌ ఖాతాలున్నాయి. వీటికి మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందడం సులభతరమైంది. మహిళలకు బ్యాంకింగ్‌ సేవలపై విస్తృత అవగాహన పెరగడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి.

కీలక నిర్ణయాల్లో మహిళల పాత్రే అధికం

మహిళల్లో ఆర్థిక, డిజిటల్‌ స్వావలంబన పెరగడంతో కుటుంబ వ్యవహారాల్లోనూ వారి పాత్ర పెరిగింది. కుటుంబ ఆరోగ్య సంరక్షణ, భారీ కొనుగోళ్లు వంటి కీలక విషయాల్లో 88–90 శాతం మంది మహిళలు భాగస్వామ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇంటర్నెట్‌ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఇంకా కొంత వెనుకబడే ఉన్నారు. మొత్తంగా ఇంటి నుంచే సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ మహిళలు నేడు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరికి డిజిటల్‌ ఫైనాన్షియల్‌ అక్షరాస్యతను మరింత పెంచితే సైబర్‌ మోసాల బారిన పడకుండా ఆర్థికంగా మరింత స్వతంత్రంగా ఎదగగలుగుతారు.

ఆధునిక కాలంలో సోషల్‌ మీడియా కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఉపాధి వేదికగా మారింది. ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌ ద్వారా మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. బట్టల వ్యాపారాలు, డిజైనర్‌ బొటిక్స్‌, కుట్టు శిక్షణ, ఇంటి తినుబండారాల విక్రయాలు ఆన్‌లైన్‌ ద్వారా జోరుగా సాగుతున్నాయి. వంటలు, వ్యవసాయం, ఆరోగ్య చిట్కాలపై వీడియోలు, రీల్స్‌ చేస్తూ బ్రాండ్‌ ప్రమోషన్ల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు.

మహిళల చేతిలో డిజిటల్‌ విప్లవం

ఫ పెరుగుతున్న సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగం

ఫ 92.8 శాతం మందికి బ్యాంక్‌ ఖాతాలు

ఫ సోషల్‌ మీడియాతో ఇంటి నుంచే వ్యాపారాలు, ఉపాధి

ఫ కుటుంబ నిర్ణయాల్లోనూ అతివల భాగస్వామ్యమే ఎక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement