పూలు కొనాల్సి వస్తోంది
కష్టమొచ్చింది
తంగెళ్లు పూయలేదు.. చెరువులు నిండలేదు
రాజాపేట : తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని తెచ్చిపెట్టే పూల పండుగ బతుకమ్మపై ఈ సారి కరువు ప్రభావం పడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా తంగేడు, గునుగు, అడవి చేమంతి, పట్టుకుచ్చులు, గుమ్మడి, ముత్యాల, బంతిపూలతో అందంగా బతుకమ్మలు పేర్చి పూల పండుగ జరుపుకుంటారు. కానీ, ఈ సారి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో గునుగు, ఇతర పూలు మొగ్గ దశలోనే ఉన్నాయి. ఇక తంగేడు చెట్లకు పూలే కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి గునుగు, తంగేడు పూలు కరువయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగ ప్రకృతి పూలు లేక వెలబోయిన పోయే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు టేకు పూలు తెంపి కట్టలు కట్టి రంగులద్ది బతుకమ్మకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు మార్కెట్‌లో దొరికే బంతి, చేమంతి పూలను కొనుగోలు చేసి బతుకమ్మలను తయారు చేసే పరిస్థితి నెలకొంది.
కరువు పరిస్థితులే కారణం
వర్షాభావ పరిస్థితుల కారణంగా కొండ కోనల్లో, బీడు భూముల్లో విరివిగా దొరికే తంగేడు, కొండ చామంతి పూల చెట్లు ఎండిపోయాయి. మెట్టపంటలైన జొన్న, మొక్కజొన్న, పెసర పత్తి చేలలో విరివిగా దొరికే గునుగు, ముత్యాల పూలు కూడా ఈ యేడాది లభించని పరిస్థితి నెలకొంది. రైతులు ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్టపంటల సాగుపై దృష్టిసారించకుండా పోవడంతో పూలకు కరువు వచ్చినట్టయ్యింది. అంతే కాకుండా ఈ యేడాది వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. గతనెలలో నవరాత్రులు ముగించుకున్న వినాయక విగ్రహాలను కూడా భక్తులు తప్పని పరిస్థితుల్లో నీళ్లులేని చెరువుల్లో వదిలేసి వెళ్లడం కరువుకు అద్దం పడుతోంది. ఒకవేళ తాము బతుకమ్మ ఆడినా చెరువులు, కంటల్లో నీళ్లు లేని కారణంగా వాటిని ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.
పూతలేని తంగేడు చెట్లు
అడపాదడపా వర్షాలు కురిసినా, అధిక మాసం కారణంగా ఈ యేడాది పూలు కరువయ్యాయి. బతుకమ్మ కోసం ఈ సారి మార్కెట్‌లో దొరికే బంతి, చేమంతి, పట్టుకుచ్చుల పూలు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– భూపతి సునీత, పారుపల్లి


