పెద్దవూర : రైతులు పండించే రకరకాల పంటల్లో ఎన్నో రకాల చీడపీడలు, బాక్టీరియా, వైరస్‌లు ఆశించి పంట నాణ్యత, దిగుబడులు క్షీణిస్తున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి చాలా రకాల రసాయన మందులు వాడుతున్నారు. కానీ సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు, వ్యవసాయదారులు ప్రాణాపాయ, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచిస్తున్నారు. పలు సూచనలు ఆయన మాటల్లోనే..
సిఫారసు చేసిన మందులే వాడాలి
పంటకు చీడపీడలు ఆశించినప్పుడు మొక్కను లేదా పంటను అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యవసాయ, ఉద్యానవన అధికారికి చూపించి వారు సిఫారసు చేసిన మందును వాడాలి. సిఫారసు చేసిన మోతాదులోనే వాడాలి. మందు పిచికారీ చేసేటప్పుడు ఆకులపై, కింది భాగంలో తడసేలా పిచికారీ చేయాలి. రెండు, మూడు రకాల మందులు వాడేటప్పుడు అవి కలిసిపోయే తత్వాన్ని గమనించి మాత్రమే వాడుకోవాలి. మందును పిచికారీ చేసే ముందు మందును డ్రమ్ములో లేదా బకెట్‌లో కలుపుకుని తర్వాత స్ప్రేయర్‌లో నింపుకుని పిచికారీ చేయాలి.
పిచికారీకి ముందు..
మందులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్‌ఫైరీ తేదీని చూసి, మందుల డబ్బాలపై ఉండే లేబుల్స్, మోతాదు, సూచనలను క్షుణ్ణంగా పూర్తిగా చదవాలి. రక్షణ దుస్తులు, పూర్తిచేతుల చొక్కా, ప్యాంటు, గ్లౌజులు, కళ్లకు రక్షణ అద్దాలు, ముక్కుకు మాస్క్ ధరించాలి. లీకేజీలు లేని మంచి నాణ్యమైన స్ప్రేయర్లను ఎంచుకోవాలి. మందును పరిశుభ్రమైన నీటితో మాత్రమే కలపాలి. ద్రావణాన్ని చేతులతో కలపకుండా కర్రనుగాని, ప్లాస్టిక్ గొట్టాన్ని గాని ఉపయోగించాలి.
పిచికారీ సమయంలో..
గాలి వీచే దిశను బట్టి నిలబడి పిచికారీ చేయాలి. వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. గాలికి ఎదురుగా నిలబడితే మందు తుంపర్లు ముఖంపై పడే ప్రమాదం ఉంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఎండ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రసాయన మందులను పిచికారీ చేయాలి. మూసుకుపోయిన నాజిల్స్‌ను నోటితో ఊదకూడదు. పిచికారీ చేసే సమయంలో ఎలాంటి తిండి తినడం, పొగతాగడం, గుట్కా నమలడం వంటివి చేయకూడదు. అవసరమైన మేరకే ద్రావణాన్ని తయారు చేసుకుని సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలి.
పిచికారీ చేసిన తర్వాత..
పిచికారీ అయిన వెంటనే చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వాడిన దుస్తులను వేరుగా ఉతకాలి. ఖాళీ డబ్బాలను పగలగొట్టి పాతిపెట్టాలి. లేదంటే సురక్షితంగా పారవేయాలి. స్ప్రేయర్ ట్యాంక్, గొట్టాలు, నాజిల్స్‌ను శుభ్రమైన నీటితో బాగా కడిగి భద్రపర్చాలి. రసాయన మందులను పిచికారీ చేసిన తర్వాత మిగిలిన మందుల ద్రావణాన్ని సురక్షిత ప్రాంతంలో పారబోయాలి. మిగిలిపోయిన మందులను పిల్లలు, పశువులకు దూరంగా భద్రపర్చాలి. ఖాళీ డబ్బాలను పారవేయాలి.
ఫ గాలివీచే దిశను బట్టి పిచికారీ చేయాలి
ఫ తప్పనిసరిగా రక్షణ దుస్తులు వాడాలి
ఫ రైతులకు పెద్దవూర ఏఓ సత్యనారాయణ సూచనలు


