అర్వపల్లి : పొలం వద్దకు వెళ్లిన వ్యక్తి పాముకాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి శివారులో శనివారం రాత్రి జరిగింది. బొల్లంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చైతన్యభారతి పాఠశాల కరస్పాండెంట్ కేసగాని మహేశ్వర్(58) శనివారం రాత్రి గ్రామ శివారులోని రుద్రమచెరువు వద్ద ఉన్న తన పొలం వద్దకు వెళ్లి అక్కడ పొలం పనులు చేస్తుండగా పాము కాటేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై నివాళులర్పించారు.
ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ
మోత్కూరు : ట్రాక్టర్ల బ్యాటరీలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీతో పాటు పక్కనే ఉన్న రైతు శాఖపురం మల్లేష్‌కు చెందిన ట్రాక్టర్ బ్యాటరీని దుండగులు అపహరించారు. ఒక్కో బ్యాటరీ విలువ రూ.8వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. రాత్రివేళ గ్రామంలో పోలీసు గస్తీ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆవుల అపహరణ
మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి శివారులో తానేదారుపల్లి గ్రామానికి చెందిన అబ్బనగోని కృష్ణయ్యకు చెందిన రెండు ఆవులను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. శనివారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలోని ఎడ్ల కొట్టంలో ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లానని.. ఆదివారం ఉదయం కొట్టం వద్దకు వచ్చి చూసేసరికి రెండు ఆవులు కనిపించలేదని బాధితుడు కృష్ణయ్య తెలిపాడు. అర్ధరాత్రి దుండగులు ఆవులను అపహరించినట్లు వాపోయాడు.
రెండు కుటుంబాల
మధ్య ఘర్షణ
● ఆరుగురికి గాయాలు
త్రిపురారం : ఇరు కుటుంబాల మధ్య పాత కక్షల నేపథ్యంలో జరిగిన గొడవలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన త్రిపురారం మండలం రూప్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కున్యతండాలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కున్యతండాకు చెందిన ధనావత్ వెంకట్రాం, ధనావత్ కృష్ణ కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రెండు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ధనావత్ దస్రు, ధనావత్ శివాజి, ధనావత్ బాలు, ధనావత్ గమ్మ, ధనావత్ చింటు, ధనావత్ శివ, ధనావత్ బాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్తులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు త్రిపురారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొట్టిన ట్రాక్టర్
● యువకుడికి తీవ్ర గాయాలు
నిడమనూరు : చేపలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హాలియాకు చెందిన నీలం శివ ఆదివారం మాడుగులపల్లి మండలం కన్నెకల్ చెరువు వద్ద చేపలు కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై హాలియా వైపు వెళ్తుండగా.. నిడమనూరు శివారులోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ యాదగిరి తెలిపారు.


