మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత భక్తప్రహ్లాద యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 8వ తేదీన సాయంత్రం 7గంటలకు ప్రార్థనా సూక్తపఠన, స్వామివారి అనుజ్ఞాస్వీకారం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, పంచగవ్యారాధన, ప్రాశన, రుత్విగ్వరణం, దీక్షాధారణ, రక్షాబంధనం, మేదినీపూజ, మత్స్యంగ్రహణం, అంకురారోపణతో ఉత్సవాలను ఆగమ ప్రవర బొర్రా వాసుదేవాచార్యులు ఆధ్యర్యంలో ప్రారంభిస్తారు. 9న ఉదయం 8గంటలకు వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుపర్యగ్రీకరణం, పంచగవ్యప్రోక్షణ, అగ్నిమథనం, శిలావిహారణం, అఖల్మషహోమం, అగ్నిప్రతిష్టాపన, పవిత్రములకు శుద్ధి, సప్తదశకుంభాసాధన, ఆవాహన, రామాయణ, భాగవత, సూర్యనమస్కారములు, రాత్రి 7గంటలకు అగ్నిధ్యానం, శయ్యావేది ప్రకల్పనం, పవిత్రావాహనం, పంచశయ్యాదివాసములు, సుదర్శన యంత్రస్థాపన, అష్టమంగళ పంచాయుధస్థాపన, బలిహరణ, నీరాజనమంత్రపుష్పములు నిర్వహిస్తారు. 10న దేవోత్తాపన, ఆరాధన, పవిత్రారోపణము గావిస్తారు. రాత్రి స్వామివారికి ఉత్సవము, మహాశాంతి హోమం చేపడతారు. 11న ఉదయం 8గంటలకు అగ్నిరాధనలు, పూర్ణాహుతి, పవిత్ర విసర్జనోత్సవం, సప్తదశకుంభారోపణం, శాంతి కల్యాణ మహోత్సవం, ఆచార్య సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి. కోదాడ, హుజూర్‌నగర్ నుంచి అదేవిధంగా ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చే భక్తులకు పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మట్టపల్లి క్షేత్రం వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. భక్తులు అదిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పవిత్రోత్సవాలలో పాల్గొనాలని ఆలయ పాలకవర్గం కోరుతున్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో
ఈ నెల 8వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు


