ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదు

Oct 4 2026 11:13 AM | Updated on Oct 4 2026 11:13 AM

భువనగిరిటౌన్‌ : విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు చేయడం సరికాదని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌, టీజీఓ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ శనివారం భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అన్నారు. విధుల్లో ఏవైనా లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఇటీవల భూదాన్‌ పోచంపల్లి పీహెచ్‌సీలో విధుల్లో ఉన్న మహిళా డాక్టర్‌ శ్వేతపై చికిత్స కోసం వచ్చిన దుద్యాల వెంకట తిరుపతి చేయిచేసుకోవడంతో పాటు కంప్యూటర్‌ ధ్వంసం చేయడం, బొమ్మలరామారం ఆర్‌ఐ కె.వెంకట్‌రెడ్డిపై బెజ్జెంకి వెంకట్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి దాడి చేయడం, అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ను ఓ మహిళా కౌన్సిలర్‌ భర్త దుర్భాషలాడటం శోచనీయమన పేర్కొన్నారు. అనంతరం జల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డిలకు వినతిపత్రాలు అందజేసి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణ, టీఎన్జీఓ జిల్లా కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌, మెడికల్‌ ఫోరం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, ట్రెసా కలెక్టరేట్‌ అధ్యక్షుడు పి.రామారావు, ప్రతినిధులు మేఘలత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

ఫ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్‌ మందడి ఉపేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement