యాదగిరిగుట్ట : వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ కోతలు లేకుండా అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను శనివారం సీపీఐ ఆధ్వర్యంలో సందర్శించారు. వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్ వస్తుందనే అంశాలను రికార్డును పరిశీలించారు. లో ఓల్టేజీ కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వని పక్షంలో రైతులు, ప్రజలతో కలిసి సబ్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, మర్రిగూడెం సర్పంచ్ బోదాసు స్వప్న జగన్, మండల కార్యవర్గ సభ్యుడు పేరబోయిన పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
నల్లగొండ టౌన్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, ఎండీ.హాశం, ప్రమీల పాల్గొన్నారు.
5న సీపీఐ ధర్నా
ఆలేరు : వ్యవసాయానికి 16 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే డిమాండ్‌తో ఈనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఐ జిల్లా నాయకుడు చెక్క వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు, రైతులు తరలిరావాలని ఆయన కోరారు.


