ఇలా చేస్తే మేలు..
దయనీయంగా బత్తాయి రైతుల పరిస్థితి
ఫ పెట్టుబడులు భారీగా పెరిగి.. దక్కని గిట్టుబాటు ధర
ఫ అప్పుల ఊబిలో రైతులు.. తోటల నరికివేత
ఫ 3లక్షల నుంచి 35వేల ఎకరాలకు పడిపోయిన సాగు
నాగార్జునసాగర్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బత్తాయి తోటలను ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులు.. గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగేది. కానీ ప్రస్తుతం జిల్లాలో బత్తాయి సాగు విస్తీర్ణం 35వేల ఎకరాల దిగువకు పడిపోయింది. ఎరువులు, పురుగు మందులు, తెగుళ్ల నివారణ, అంతర సేద్యం, కలుపు నివారణ మందులు, కూలీల రేట్లు, నీటి నిర్వహణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. మరోవైపు మార్కెట్‌లో ధర మాత్రం రైతు చేతిలో ఉండటం లేదు. పంట చేతికొచ్చిన సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు తమ సరుకును తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ధర తగ్గే సమయానికి మార్కెట్‌లో సరుకు వెల్లువెత్తుతోంది.
దళారుల చేతుల్లో ధర..
బత్తాయి ధరను మార్కెట్‌లో మధ్యవర్తులు, దళారులు నిర్ణయిస్తున్నారు. ఉత్పత్తుల నిల్వ, రవాణా, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ సదుపాయాలు లేకపోవడంతో రైతుకు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే అవకాశం దక్కడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
ఐదు వేల ఎకరాలకు పైగా తోటల తొలగింపు
వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటడం, బోర్ల తవ్వకాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడం బత్తాయి రైతులను మరింత కుంగదీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాదిలోనే ఇప్పటికే సుమారు 5,000 ఎకరాలకు పైగా బత్తాయి తోటలను తొలగించినట్లు రైతులు చెబుతున్నారు. మరికొన్ని వేల ఎకరాల తోటలు కూడా తొలగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఆయకట్టు ప్రాంతాల్లో నీటి వసతి పుష్కలంగా ఉన్న చోట కూడా కొందరు రైతులు బత్తాయి సాగును వదులుకుంటున్నారు. బత్తాయి సాగుపై పూర్తిగా నమ్మకం కోల్పోతున్న రైతులు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరి సాగు వైపు, మరికొందరు ఆయిల్ పామ్ వైపు వెళ్తున్నారు.
‘అమూల్’ తరహాలో రైతు సహకార వ్యవస్థ
గుజరాత్‌లోని ‘అమూల్’ తరహాలో రైతులే యజమానులు, భాగస్వాములుగా ఉండే బలమైన సహకార మార్కెటింగ్ వ్యవస్థను బత్తాయి సాగు చేసే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి పట్టణానికి సమీపంలోని ప్రధాన రహదారులపై రైతుల ఆధ్వర్యంలోనే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏ మార్కెట్‌లో ఎంత ధర ఉంది? ఎక్కడ ఎంత డిమాండ్ ఉంది? ఎప్పుడు ఎంత సరుకు అవసరం? వంటి సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. ముందస్తు బుకింగ్, రవాణా, నిల్వల వంటి సదుపాయాలను ఈ సంఘం ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
బత్తాయి రైతును కాపాడాలంటే కేవలం తాత్కాలిక సబ్సిడీలతో సరిపెట్టకుండా, రైతుకు అండగా నిలిచే సమగ్ర వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చీడపీడల నివారణకు సబ్సిడీపై నాణ్యమైన పురుగు మందులు సరఫరా చేయాలి. నీటి వసతి కల్పనకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పంట నష్టపోతే తక్షణమే అందేలా సమర్థవంతమైన బీమా పరిహారాన్ని వర్తింపజేయాలి. గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వమే మార్కెట్ జోక్యం చేసుకోవాలి. శీతల గిడ్డంగులు, గ్రేడింగ్, ప్యాకింగ్ కేంద్రాలు, బత్తాయి రసం/జ్యూస్ మరియు ఇతర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను తక్షణమే నెలకొల్పాలి. రైతు నుంచి వినియోగదారుడికి నేరుగా విక్రయించే మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ మార్కెట్లకు బత్తాయి ఎగుమతి అయ్యేలా ప్రోత్సాహకాలు అందించాలి. పంట ధరలు, మార్కెట్ డిమాండ్‌పై ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి.


