కోదాడ : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న జరిగే బీసీ కవులు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ కోరారు. బుధవారం కోదాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు’ సంకలన రజతోత్సవ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాహిత్యంలో చరిత్ర సృష్టించిన వెంటాడే కలాలు–వెనుకబడిన కులాలు సంకలనం రజతోత్సవంతో పాటు బీసీ కవుల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 300 మంది బీసీ కవులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. 25 మంది బీసీ కవుల ఆత్మఘోషగా ఆవిష్కరించబడిన ఈ కవితా సంకలనానికి పుట్టినిల్లు కోదాడ కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, బాణాల వసంత, వేముల వెంకటేశ్వర్లు, జీఎల్‌ఎన్ రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, పుప్పాల కృష్ణమూర్తి, సరికొండ నరసింహారాజు పాల్గొన్నారు.


