బైక్‌ అదుపుతప్పి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి మహిళ మృతి

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

భువనగిరి(బీబీనగర్‌) : బైక్‌ అదుపుతప్పడంతో కిందపడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన బీబీనగర్‌ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం జూలూరు తండా గ్రామానికి చెందిన ధరావత్‌ పద్మ(32) తన బంధువు సుధాకర్‌తో కలిసి బైక్‌పై శనివారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో బీబీనగర్‌ మండల కేంద్రంలోని ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పడంతో కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పద్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

టిప్పర్‌ ఢీకొని..

భువనగిరి : బైక్‌ను వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన భువనగిరి మండల పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బరిగె నవనీత(46) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లింది. పని ముగిసిన తర్వాత తన భర్త నర్సింహతో కలిసి బైక్‌పై భువనగిరికి పని నిమిత్తం వెళ్తుండగా.. మార్గమధ్యలో భువనగిరి మండలం మాసుకుంట వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న టిప్పర్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవనీత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. నర్సింహకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నర్సింహను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నవనీత మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

భూదాన్‌పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు శ్రీపతి సిద్దిరాములు (60) ఈ నెల 1వ తేదీ రాత్రి పనిమీద ద్విచక్ర వాహనంపై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్కండేయనగర్‌ కాలనీ సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం లైట్లు కళ్లపై పడటంతో దారి కనిపించక ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ భాగంలో ఎముక విరగడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించారు. 10 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మూడు రోజుల క్రితం సిద్దిరాములు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి..

చౌటుప్పల్‌ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 49) ఈ నెల 12న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 81726 62505 నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కృష్ణమాల్‌ సూచించారు.

డీసీఎంను ఢీకొట్టిన లారీ

చిట్యాల : లారీ టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న డీసీఎం గుండ్రాంపల్లి శివారులోకి రాగానే టైరు పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ రోడ్డు పైనే నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డివైడర్‌ పైకి ఎక్కి ఆగిపోయింది. లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement