రాజాపేట : పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం పవర్‌లూమ్స్(మరమగ్గాలు) పరిశ్రమపై పడింది. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో గత ఆరు దశాబ్దాలుగా వందలాది మంది కార్మికులు పవర్‌లూమ్స్ వివిధ వస్త్రాలు తయారుచేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రతినెలా రెండు లారీల వస్త్రాల లోడ్‌ను ముంబై నుంచి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసేవారు. కాగా యుద్ధం కారణంగా వారం రోజులుగా ఎగుమతులు నిలిచిపోవడంతో గ్రామంలో వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మాస్టర్ వీవర్స్‌తో పాటు వీవర్స్, ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి పొందుతున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పవర్‌లూమ్స్‌లో వస్త్రాల ఉత్పత్తి కూడా నత్తనడకన సాగుతోందని మాస్టర్ వీవర్స్ బోగ లక్ష్మీనారాయణ, కటుకం వెంకటేశం, రాచకొండ స్వామి చెబుతున్నారు.
పవర్‌లూమ్స్‌పై వస్త్రాల తయారీ ఇలా..
రఘునాథపురం గ్రామంలో 800కు పైగా పవర్‌లూమ్స్ ఉండగా.. ఇందులో 400 మరమగ్గాలపై కడ లుంగీలు తయారు చేస్తున్నారు. ఒక్క మరమగ్గంపై పది చొప్పున, గ్రామంలో రోజుకు 3000 వరకు కడ లుంగీలు ఉత్పత్తవుతాయి. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000కి పైగా కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు పవర్‌లూమ్స్ కార్మికులు, లుంగీలకు కడలు వేసే కార్మికులు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే ఉగాండా, నక్కీ ఉగాండా, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బై పిక్ వంటి కడ లుంగీలను నేరుగా ముంబై నుంచి ఉగాండా, దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్‌తో పాటు ఇతర పశ్చిమాసియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. యుద్ధం కారణంగా ముడిసరుకు కొనలేక, తయారుచేసిన వస్త్రాలను ఎగుమతి చేయలేక కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
ఫ పశ్చిమాసియా యుద్ధం కారణంగా నిలిచిన వస్త్రాల ఎగుమతులు
ఫ అయోమయంలో
మాస్టర్ వీవర్స్, కార్మికులు


