పశువుల పెంటతో భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

పశువుల పెంటతో భూసారం పెంపు

Mar 22 2026 7:30 AM | Updated on Mar 22 2026 7:30 AM

పెద్దవూర : వ్యవసాయంలో పంట దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో భూమి నాణ్యత దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. పశువుల పెంటను పొలాల్లో వేయడం వలన నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయన ఎరువుల భారం తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల ఉపయోగంపై పెద్దవూర మండల వ్యవసాయాధికారి పి. సందీప్‌కుమార్‌ సూచనలు ఆయన మాటల్లోనే..

● పశువులు, మేకలు, గొర్రెల పెంట పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇళ్లలో ఏడాది కాలంగా ఉన్న పశువుల పెంట, చెత్తాచెదారం పూర్తిగా కుళ్లిపోతుంది. దీనిని పొల్లాలో వేయడం వలన నేలలో సారం పెరుగుతుంది. ఇది సేంద్రియ ఎరువుతో సమానం. దీనిని దుక్కులు దున్నడానికి ముందే పంట పొలాల్లో వేసి దున్నితే చాలా మంచిది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. దుక్కులు దున్నిన తర్వాత పశువుల పేడ మొత్తం భూమిలోకి వెళ్లి పంట దిగుబడిని పెంచడానికి దోహదపడుతుంది. పంట ఎదుగుదల, మొక్కలు బలంగా ఉండేందుకు పశువుల పేడ ఉపయోగపడుతుంది. ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల పెంటను వినియోగించాలి.

● పశువుల పేడను వేసిన తర్వాత భూమిని కలియదున్నితే నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మపోషకాలు తగిన మోతాదులో అందుతాయి. మొక్క బాగుండి మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే చెరువుల్లో పూడిక తీసిన సమయంలో వచ్చే నల్లమట్టిని వ్యవసాయ భూమిలో పోయించుకుంటే భూసారం పెరుగుతుంది. ఇది నీటిని ఎక్కువగా పీల్చుకుని నేలలో చాలా సమయం వరకు తేమ ఉండేటట్లు చేస్తుంది. దీంతో మొక్కకు నీటి లభ్యత ఎల్లప్పుడూ ఉంటుంది.

● సాధారణంగా రైతులు వేసవిలో పశువుల ఎరువును వ్యవసాయ పొలాలకు తరలిస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అధిక ఎండల కారణంగా పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరి అవుతాయి. పశువుల పెంటను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి వెంటనే దుక్కిలో కలియదున్నాలి. దీనివలన భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారడానికి తోడ్పడుతుంది. సహజసిద్ధమైన లవణాలు అందుతాయి. నేలలోని ఆమ్లత్వం, క్షారత్వం, నీటిని నిల్వ ఉంచే గుణాన్ని అదుపు చేసి మొక్కలకు అందేవిధంగా సహాయపడతాయి.

ఇలా దుక్కి దున్నాలి

దుక్కిని ఎలా పడితే అలా దున్నడం వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుంది. రైతులు వేసవిలో మెట్ట భూములను వానాకాలం సీజన్‌ కోసం సన్నద్ధం చేస్తుంటారు. వేసవిలో వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి నీటి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. దీంతో మెట్ట ప్రాంతాలలో భూమి వాలుకు అడ్డంగా దుక్కి చేయాలి. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.

ఫ పెద్దవూర మండల వ్యవసాయాధికారి

సందీప్‌కుమార్‌ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement