శాలిగౌరారం : ట్రాక్టర్ యూనియన్ పట్టుదల ఆరుగాలం కష్టపడిన రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది. శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో 100 హెచ్‌పీ(ఎస్‌ఎస్–16) సామర్ధ్యం గల విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ పరిధిలో 20 బోరు మోటార్లు ఉన్నాయి. ఆయా బోరు మోటార్ల కింద సుమారు 80 ఎకరాలకు పైగా వరి పంట సాగవుతోంది. ప్రస్తుతం వరి చేలు పొట్ట, కంకి దశలో ఉన్నాయి. అయితే వారం క్రితం ఆ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను నకిరేకల్‌లోని రిపేర్ సెంటర్‌కు తరలించేందుకు గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్‌ను రైతులు కిరాయికి రమ్మని అడుగగా.. ట్రాక్టర్ యూనియన్‌ను సంప్రదించాలని సూచించాడు. దీంతో రైతులు ట్రాక్టర్ యూనియన్‌ను సంప్రదించగా.. రైతుల వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారికి మట్టిపోసిన డబ్బులు కొంతమేర పెండింగ్ ఉన్నాయని, వాటిని ఇస్తేనే ట్రాక్టర్‌ను పంపుతామని యూనియన్ ప్రతినిధులు రైతులకు తేల్చిచెప్పారు. దీంతో తాము ఎలాంటి బాకీలు లేమని దారికి మట్టిపోసిన డబ్బులు పూర్తిగా చెల్లించామని రైతులు తెలిపారు. దీంతో ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులు రైతుల వాదనను తిరస్కరించారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు గ్రామంలోని యూనియన్‌కు చెందిన ట్రాక్టర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల ట్రాక్టర్లు కూడా వెళ్లొద్దని యజమానులను హెచ్చరించారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించేందుకు ట్రాక్టర్లు రాకపోవడంతో వారం రోజులుగా రిపేరుకు తరలించేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు విద్యుత్ అధికారులకు ఫోన్‌చేసి విద్యుత్ శాఖకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను తరలించే వాహనాన్ని పంపించాలని కోరారు. విద్యుత్‌శాఖకు చెందిన ట్రక్కు వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో నీళ్లు లేక రైతుల వరి పొలాలు ఎండిపోయాయి. పంటలు ఎండిపోవడంతో రైతులు ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులపై శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా.. శనివారం విద్యుత్‌శాఖకు సంబంధించిన వాహనం కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్లేందుకు రాగా.. ఆ వాహనం ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న చోటుకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో రైతులు ఎద్దుల బండిపై కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను పెట్టుకొని స్వయంగా బండిని లాగుతూ విద్యుత్‌శాఖ వాహనం వద్దకు తీసుకెళ్లి అందులోకి ఎక్కించారు. రిపేర్ అనంతరం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకొచ్చి తిరిగి ఏర్పాటు చేశారు.
ఫ అడ్లూరులో వారం క్రితం
కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
ఫ ట్రాన్స్‌ఫార్మర్ తరలింపును
అడ్డుకున్న ట్రాక్టర్ యూనియన్
ఫ నీళ్లందక ఎండిన పొలాలు
ఫ ట్రాక్టర్ యూనియన్ ప్రతినిధులపై పోలీస్ స్టేషన్‌లో రైతుల ఫిర్యాదు


