దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దొంగ అరెస్టు

Mar 22 2026 7:30 AM | Updated on Mar 22 2026 7:30 AM

నల్లగొండ : వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను నల్లగొండ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని రామగిరిలో గల అయ్యప్ప ఆలయంలో హుండీతో పాటు స్కూటీ, రెండు సెల్‌ఫోన్లు చోరీ జరిగినట్లు మాతంగి సాయినాథ్‌ అనే వ్యక్తి నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో నివాసముంటున్న పొలిసెట్టి కార్తీక్‌ కుమారస్వామి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి గురువారం సావర్కర్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతడి నుంచి స్కూటీ, ఆటో, రెండు సెల్‌ఫోన్లు, రూ.3,000 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఆటో నడిపేవాడని డీఎస్పీ పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

తిప్పర్తి : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తిప్పర్తి ఏఎస్‌ఐ సింగం రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామానికి చెందిన వీరమల్ల చంద్రయ్య(58)కు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి ఖర్చులు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో శుక్రవారం ఇంట్లో గడ్డి మందు తాగాడు. అతడిని వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య వీరమల్ల వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

బైక్‌ అదుపుతప్పి

యువకుడి దుర్మరణం

పెద్దఅడిశర్లపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి రోడ్డుపై కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల పరిధిలోని సంగారం గ్రామానికి మస్క యాదగిరి (23) బైక్‌పై అంగడిపేట ఎక్స్‌రోడ్‌ నుంచి స్వగ్రామం వెళ్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం గ్రామ స్టేజీ వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో యాదగిరికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement