యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు కొండపైన ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా కిందపడిపోగా.. ఆమె కాలు పైనుంచి బస్సు వెనుక టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన అనిత, అంజప్ప దంపతులు తమ కుమార్తె, ఐదు నెలల కుమారుడితో కలిసి శుక్రవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చారు. శనివారం ఉదయం స్వామిని దర్శించుకునేందుకు ఆర్టీసీ బస్సులో కొండ పైకి చేరుకున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం కొండపైన గల ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత ఆర్టీసీ బస్సు రావడంతో అది ఎక్కేందుకు వెళ్లారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా.. అనిత కిందపడిపోయింది. దీంతో బస్సు వెనుక టైరు అనిత కాలు పైకి ఎక్కడంతో కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే అనితను అంబులెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తన భార్య అనిత కాలు నుజ్జునుజ్జయ్యిందని ఆమె భర్త అంజప్ప కన్నీరు పెట్టుకున్నాడు.
ఫ నుజ్జునుజ్జయిన కాలు.. ఆస్పత్రికి తరలింపు
ఫ యాదగిరి కొండపైన బస్టాండ్‌లో ఘటన


