జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు
ఫ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో అమలు
ఫ వర్చువల్ విధానంలో
విద్యార్థులకు బోధన
భువనగిరి : ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భువనగిరిలోని నర్సింగ్ కళాశాలలోనూ ఆ రెండు భాషలపై బోధన చేస్తున్నారు.
ప్రారంభమైన తరగతులు
నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఈ నెల 3నుంచి వర్చుల్ విధానం ద్వారా తరగుతులు ప్రారంభించారు. ఈ కోర్సు వ్యవధి 16 నెలలు కాగా.. ప్రతి సెమిస్టర్ నాలుగు నెలల పాటు ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లో నర్సులకు డిమాండ్ ఉంది. ప్రావీణ్యం కలిగిన వారికి నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వేతనం అందుతుంది. జర్మనీలో అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనం ఉంటుంది. ప్రస్తుతం ఆయా భాషలను నేర్పించడంతో పాటు అక్కడి సంస్కృతి, సంప్రదాయలు గురించి కూడా విద్యార్థులకు వివరిస్తున్నారు. భువనగిరిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 58 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 40 మంది జర్మన్, జపనీస్ భాషలు నేర్చుకుంటున్నారు. జపనీస్ 20, జర్మన్ భాష తరగతులకు 20 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఓరియంటేషన్ తరగతులు నడుస్తున్నాయి. త్వరలో పూర్తిస్థాయి తరగతులు ప్రారంభంకానున్నాయి.
ఇప్లూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో..
నర్సింగ్ విద్యార్థులు జర్మన్, జపనీస్ భాషలను నేర్పించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజేస్ యూనివర్సిటీ (ఇప్లూ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనివర్సిటీ ద్వారా త్వరలో ఆన్‌లైన్ ద్వారా పూర్తిస్థాయి తరగతులు నిర్వహించనున్నారు. తరగతుల నిర్వహణకు సంబందించి టైంటేబుల్ కూడా ఏర్పాటు చేశారు.
ఉజ్వల భవిష్యత్, మంచి వేతనం
జర్మన్, జపాన్ దేశాల్లో నర్సుల కొరత ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆయా దేశాల భాషలను నర్సింగ్ విద్యార్థులకు నేర్పించాలని నిర్ణయించింది. ఈ భాషలపై పట్టు సాధించిన వారికి అక్కడ విరివిగా ఉద్యోగ అవకాశాలు లభిస్థాయి. మంచి భవిష్యత్, భారీ వేతనం ఉంటుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి,
భువనగిరి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్
జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు
జర్మన్, జపనీస్ భాషల్లో పాఠాలు


