మల్లాపురంలో పోలీసుల కవాతు
యాదగిరిగుట్ట రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురంలో ఆదివారం యాదగిరిగుట్ట పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం గ్రామ వీధుల్లో తిరిగారు. భయబ్రాంతులకు లోనుకాకుండా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లక ఉసీఐ భాస్కర్ సూచించారు.
పోచంపల్లి
అర్బన్‌బ్యాంక్‌కు అవార్డులు
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును అవార్డులు వరించాయి. కర్నాటక రాష్ట్ర అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్, బ్యాంకర్స్ మీడియా అసోషియేషన్ ఆధ్వర్యంలో భారత్ నెట్‌వర్క్ గ్రూప్, దక్షిణ భారత కోఆపరేటివ్ బ్యాంక్‌లకు 2025 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించింది. వినియోగదారులకు ఉత్తమ సేవలందించినందుకు గాను పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు ఉత్తమ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, ఉత్తమ సీఈఓ, ఉత్తమ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్ మూడు అవార్డులు దక్కాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, సీఈఓ సీత శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కర్నాటి వెంకట బాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూరెపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, మక్తాల నర్సింహ, బిట్టు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుల రద్దీతో పంచనారసింహుడి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేసి, గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు.
మల్లాపురంలో పోలీసుల కవాతు
మల్లాపురంలో పోలీసుల కవాతు


